జగన్! మోడీ నిన్నూ వదిలిపెట్టరు, మావైపు రా: శరద్ యాదవ్ హెచ్చరిక
గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ తనకు ఏదో మేలు చేస్తారని వైసిపి అధినేత జగన్ ఆయనతో భేటీ అయ్యారని, జగన్ ఓ విషయం గుర్తు పెట్టుకోవాలని, ప్రధాని నిన్ను కూడా వదిలి పెట్టరని జేడీయూ నేత శరద్ యాదవ్ హెచ్చరించారు.
గుంటూరులో జరిగిన ప్రత్యేక హోదా భరోసా సభలో ఆయన మాట్లాడారు. జగన్నే కాదు దేశంలో ఎవరినీ మోడీ వదిలి పెట్టరని చెప్పారు. జగన్ తమతో వచ్చి కలవాలని ఆయన సూచించారు.
చదవండి: చంద్రబాబు, జగన్లను ప్రశ్నించిన అఖిలేష్
తద్వారా, జగన్ కేసుల గురించే మోడీని కలిశారని, కానీ ఆయన వదిలి పెట్టరని శరద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. అంతకుముందు అఖిలేష్ మాట్లాడుతూ.. ఏపీకి హోదా ఇస్తే ఎవరు కాదనరని చెప్పారు.
అన్ని పార్టీల సహకారంతో హోదా సాధనకు కృషి చేస్తున్నామని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. హోదా సాధించేందుకుగాను గతంలో పార్లమెంటులో కేవీపీ ప్రయివేటు బిల్లు ప్రవేశపెట్టినా, కోటి సంతకాలు సేకరించినా, ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులపై కేసులు పెట్టినా, రాహుల్ నినదించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
అందువల్లే, అన్ని పార్టీల సహకారంతో తాము అనుకున్న లక్ష్యం సాధించాలనే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనతో పాటు పునర్విభజన చట్టంలోని మిగతా అంశాల సాధనే తమ పార్టీ లక్ష్యమని రఘువీరా పేర్కొన్నారు.