
మోడీ భీమవరం టూర్ లో అచ్చెన్నాయుడికి షాక్-అక్కడికి రాకుండా-ఎస్పీజీ అనుమతించినా..
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పోరు ప్రభావం ఇవాళ భీమవరంలో జరుగుతున్న అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలపైనా పడింది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే టీడీపీ, జనసేనతో పాటు తన ప్రత్యర్ధి పార్టీల అధినేతల్ని రాకుండా అడ్డుకున్న జగన్ సర్కార్.. ఆయా పార్టీలకు చెందిన కీలక నేతల్ని కూడా రానివ్వలేదు.
ప్రధాని మోడీ భీమవరం టూర్ లో భాగంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడికి సీఎం జగన్, గవర్నర్ హరిచందన్ తో పాటు పలువురు బీజేపీ నేతలు వచ్చి ఆయనకు ఆహ్వానం పలికారు. కానీ అక్కడికి వెళ్లేందుకు ముందుగా ఆహ్వానం ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మాత్రం చివర్లో షాక్ తగిలింది. ప్రధాని మోడీ వచ్చే హెలిప్యాడ్ దగ్గరి కెళ్లి ఆయనకు ఆహ్వానం పలికేందుకు అచ్చెన్నాయుడిని అనుమతించలేదు. జిల్లా కలెక్టర్ తయారు చేసిన ఆహ్వానించే వారి జాబితాలో అచ్చెన్నాయుడు పేరు లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో అక్కడి వరకూ వచ్చిన అచ్చెన్నాయుడు వెనుదిరగాల్సి వచ్చింది.

అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ఆహ్వానించిన అతిథులకు అవమానం జరిగినట్లయింది. కేంద్ర పర్యాటక శాఖ నుంచి రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం అందించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెనాయుడికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి హెలిప్యాడ్‌కు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. అయితే తనకు వచ్చిన లిస్టులో అచ్చెన్న పేరు లేదని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ డీఐజి ఇచ్చిన జాబితాలో కూడా అచ్చెన్నాయుడు పేరు ఉంది. ఈ విషయం కలెక్టర్‌కు చెప్పినప్పటికీ తన జాబితాలో లేదని ఆయన తేల్చిచెప్పేశారు. కేంద్ర మంత్రి చెప్పినా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో కేంద్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ జాబితాలో పేరు లేదని చెప్పటంతో బసచేసిన ప్రాంతంలోని అచ్చెనాయుడు ఆగిపోయారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహ్వానించి అవమానించడం ఏమిటని మండిపడుతున్నారు