అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడికి షాక్ .. కేసులు నమోదు చేసిన టెక్కలి పోలీసులు
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడుకు పోలీసులు షాక్ ఇచ్చారు. దివంగత నేత ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా నందిగామ లో మంగళవారం ఎన్టీఆర్, ఎర్రన్నాయుడి విగ్రహ ఆవిష్కరణ ర్యాలీలో పాల్గొన్న అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులతో పాటు టిడిపి ముఖ్య నేతలపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటుగా 48 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే మంగళవారం నాడు నందిగామలో దివంగత నేత ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా అచ్చెన్నాయుడు నిమ్మాడలో ఎర్రన్నాయుడు సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ , ఎర్రన్నాయుడు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముందుగా టీడీపీ ముఖ్య నేతలు అందరూ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహిస్తున్న టిడిపి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. కోటబొమ్మాలి సమీపంలో టిడిపి నేతల ర్యాలీని అడ్డుకున్న టెక్కలి పోలీసులు ర్యాలీకి అనుమతి లేదని, కరోనా నిబంధనల దృష్ట్యా ర్యాలీని నిలిపివేయాలని సూచించారు. దీంతో పోలీసుల తీరుపై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు తాము విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళుతున్నామని, విధ్వంసం సృష్టించడానికి కాదంటూ మండిపడ్డారు. ర్యాలీని అడ్డుకున్న ఊరుకునేది లేదని తేల్చి చెప్పిన అచ్చెన్నాయుడు అక్కడే బైఠాయించి ఆందోళన చేపడతామని పోలీసులపై మండిపడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు బుధవారం నాడు వారిపై కేసులు నమోదు చేశారు. వీఆర్వో ఆరంగి మల్లేశ్వరరావు ఫిర్యాదు చేయడంతోనే కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, మోటార్ వాహన చట్టం కింద టిడిపి నేతలపై కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది.
ఎర్రన్నాయుడు వర్ధంతి ర్యాలీ నిర్వహించినందుకు పోలీసులు కేసు నమోదు చేయడంపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. కరోనా నిబంధనలు టీడీపీ నేతలకే వర్తిస్తాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతలు ఎలాంటి కార్యక్రమాలు చేసినా, పెద్ద ఎత్తున సభలు-సమావేశాలు పెట్టినా అక్కడ కరోనా రాదని, తెలుగుదేశం పార్టీ నేతలు ఏ చిన్న కార్యక్రమం చేసినా కరోనా ఆంక్షలు గుర్తొస్తాయి అని మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. వైసిపి హయాంలో ఇలాంటి కేసులు మామూలే అంటూ పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.