• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీ రాజధాని: 2 ఔటర్ రింగ్ రోడ్లు, ఒక నెక్లెస్‌ రోడ్డు

By Nageswara Rao
|

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి అన్ని వైపులా భారీ పరిశ్రమల సముదాయాల్ని అభివృద్ధి చేయాలని సింగపూర్ బృందం సిఫార్సు చేసింది. రాజధానికి ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఎనిమిది పట్టణాలు నూజివీడు, గన్నవరం, గుడివాడ, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, అమరావతి, నందిగామలు కేంద్రాలుగా స్థానికంగా ఇప్పటికే ఉన్న పరిశ్రమలను ఆసరా చేసుకుంటూ ఇండస్ట్రీ క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది.

ఈ పట్టణాలు, నగరాలకు ఇతర ప్రాంతాలతో ఇప్పటికే మెరుగైన రహదారి వసతులున్నాయి. కొత్తగా నిర్మించే రెండు ఔటర్ రింగ్ రోడ్డులతో మరింత మెరుగ్గా రహదారి సౌకర్యం సమకూరుతుందని సింగపూర్‌ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది.

విజయవాడ రాజధాని ప్రాంతాన్ని సైతం అగ్రో ప్రాసెసింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటో, ఐటీ, ఐటీ ఆధారిత సేవల కేంద్రంగా మార్చాలని సూచించింది. అమరావతిని మాత్రం పరిశ్రమలకు కాకుండా దేవాలయాలు, సాంస్కృతిక కేంద్రాలు, పాఠశాలలకు కేంద్ర స్థానంగా ఉంచాలని సిఫార్సు చేసింది.

So many industries are coming new capital of andhra pradesh

నెక్లెస్‌ రోడ్డు:

రాజధానికి ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు, రెండు ఔటర్ రింగ్ రోడ్డులు నిర్మించాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం భావించింది. భౌగోళికంగా కొన్ని వ్యతిరేకతలు ఉండటంతో ఇన్నర్ రింగ్ రోడ్డుని నెక్లెస్‌ రోడ్డుగా కుదించాల్సి వచ్చింది. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో భారీగా కొండలు, అడవులు ఉండటంతో ఆ ప్రాంతాన్ని మినహాయించి మిగిలిన దానిని భారీ నెక్లెస్‌ రోడ్డుగా అభివృద్ధి చేయాలని సింగపూర్‌ బృందం ప్రతిపాదించింది.

నెక్లెస్‌ రోడ్డు రాజధాని ప్రాంతం చుట్టూ తిరుగుతూ ఒక వైపున విజయవాడ నగరానికి ఎగువగా వెళుతూ నూజివీడు రోడ్డు వద్ద ముగుస్తుంది. రెండో వైపు రాజధానికి రెండో దిశగా నందిగామ వైపున జాతీయ రహదారి వద్ద ముగుస్తుంది.

ఇక గుంటూరు, తెనాలి, విజయవాడ, గన్నవరంలకు పైభాగాన... సత్తెనపల్లి, నూజివీడులకు దారి తీసే రహదారుల మీదుగా ఒక ఔటర్ రింగ్ రోడ్డుని నిర్మించాలని సింగపూర్‌ బృందం సూచించింది.

దీనికి ఎగువన మొత్తం సీఆర్‌డీఏ ప్రాంతాన్ని కలుపుతూ మరో అతి పెద్ద ఔటర్ రింగ్ రోడ్డుని కూడా నిర్మించేలా ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌ బృందానికి సూచించినట్లు సమాచారం.

విజయవాడ నుంచి కొత్త రాజధాని కేంద్రానికి మధ్య దూరం 12కి.మీ.:

విజయవాడ నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో కొత్త రాజధాని కేంద్రం ఉండబోతోంది. అక్కడినుంచి కనిష్ఠంగా 20కి.మీ. నుంచి గరిష్ఠంగా 35కి.మీ. వ్యాసార్ధంతో తొలి ఔటర్ రింగ్ రోడ్డు ఉండబోతుంది.

బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు:

ఏపీ ప్రభుత్వం ఈనెల 12న రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో రాజధాని నిర్మాణం కోసం రూ. వెయ్యి కోట్లు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు సంవత్సర కౌలు చెల్లింపులతోపాటు మౌలిక వసతుల కల్పన కోసం ఈ మొత్తాన్ని కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 94(3) ప్రకారం రాజధాని ప్రాంతంలో రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలితోపాటు ఇతరత్రా అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వమే ఆర్థికసాయం చేయాలి.

రాజధాని సమగ్ర అభివృద్ధి ప్రణాళిక పూర్తైన తరువాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఓ నివేదిక రూపొందించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే నిధులు కేటాయించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే ఆ మొత్తాన్ని కేంద్రం తిరిగి చెల్లిస్తుంది.

English summary
So many industries are coming new capital of andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X