కేంద్రం ఏపీ చిరకాల కోరిక తీర్చింది: వైసీపీ సర్కారుపై ఉద్యమమేనంటూ సోము వీర్రాజు, జీవీఎల్
అమరావతి: దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిధులను ఇచ్చిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. అదే సమయంలో ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే ఏపీలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వ్యాఖ్యానించారు.

విశాఖ రైల్వే జోన్ బీజేపీతోనే సాధ్యమైంది: సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరిక విశాఖ రైల్వే జోన్ భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమైందని సోము వీర్రాజు అన్నారు. ఏపీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరాల జల్లులు కురిపించారన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయ్యిందని కేంద్ర మంత్రి ప్రకటించారని గుర్తుచేశారు. కాగా, విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. జోన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఏపీ సర్కారు షేర్ కట్టకపోవడం వల్లే...: సోము వీర్రాజు
ఇది ఇలావుండగా, కోనసీమ రైల్వే లైనుకి రాష్ట్ర ప్రభుత్వం షేర్ కట్టకపోవడంతో బీజేపీ మాత్రమే ఉద్యమం చేస్తోందన్నారు సోము వీర్రాజు. అదేవిధంగా కడప-బెంగుళూరుకు రైల్వే లైనుకి రాష్ట్ర ప్రభుత్వం షేర్ జమ చేయకపోవడంతో పనులు ఆగిపోతున్నాయని ఆరోపించారు. కడప-బెంగుళూరు రైల్వే లైన్ స్టేట్ షేర్ కట్టించే విధంగా ఉద్యమిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రైల్వే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లప్తంగా వ్యవహరించడం వల్ల ఆంధ్రాకు అన్యాయం జరుగుతోందన్నారు సోము వీర్రాజు.

అబద్ధాలంటూ.. వైసీపీ సర్కారుకు జీవీఎల్ సవాల్
మరోవైపు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కూడా ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా ఏపీకి కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులతో పథకాలకు తమ పేర్లు పెట్టుకుని సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రం కరోనా సమయంలో 20 నెలలపాటు ఉచిత బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేసిందని ఈ సందర్భంగా జీవీఎల్ నర్సింహారావు గుర్తు చేశారు. గత ఆరేళ్లలో 24 వేల కోట్లు ఆహార సబ్సిడీ కింద ఏపీకి ఇచ్చామని.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేసిందన్న దానిపై వైసీపీ నేతలతో బీజేపీకి చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అబద్దాలు ప్రచారాలు చేసి వైసీపీ, టీడీపీ ప్రజలను మభ్య పెడుతున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సాయం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతాయన్నారు జీవీఎల్ నర్సింహారావు.