పవన్‌ను వాడుకోలేదు, చెప్తా, లోకేష్‌తో విభేదాల్లేవు: సుజన, జగన్ జైలుకెళ్తాడో..
ప్రత్యేక ప్యాకేజీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుమానాల నివృత్తి, మంత్రి నారా లోకేష్‌తో విభేదాలు, వైసిపి అధినేత జగన్ కేసులు, ఎమ్మెల్యేల చేరిక, ఎంపీ శివప్రసాద్ అసంతృప్తి తదితరాలపై సుజన స్పందించారు.
విజయవాడ: ప్రత్యేక ప్యాకేజీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుమానాల నివృత్తి, మంత్రి నారా లోకేష్‌తో విభేదాలు, వైసిపి అధినేత జగన్ కేసులు, ఎమ్మెల్యేల చేరిక, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అసంతృప్తి తదితరాలపై కేంద్రమంత్రి సుజనా చౌదరి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్పందించారు.
హోదా కంటే ప్యాకేజీ మేలు అని తెలుసుకున్నామని సుజన చెప్పారు. అలాగే, లోకేష్‌తో విభేదాలు లేవని చెప్పారు. తాను పార్టీలో నెంబర్ టూ కాదని చెప్పారు. వైసిపిలోని ఓ గ్రూప్ మాత్రమే టిడిపిలో చేరిందని సుజన అన్నారు. జగన్‌ను జైలుకు పంపించాల్సిన అవసరం తమకు లేదన్నారు.

పవన్ కళ్యాణ్‌కు క్లారిటీ ఇస్తా
ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీతోనే ప్రయోజనాలు అన్నారు. ఈ విషయమై తాము ఆయనకు క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. పవన్ కళ్యాణ్‌ను తాము వాడుకొని వదిలేయలేదని చెప్పారు. ఏపీలోని ఎవరు ప్రశ్నించినా, ప్రతి వ్యక్తికి సమాధానం చెబుతామన్నారు. పవన్‌కు కూడా చెబుతామన్నారు.
అయితే పవన్ కళ్యాణ్‌కు తాము సమాధానం చెప్పాలంటే ఓ ప్లాట్ ఫాం కావాలన్నారు. అపాయింటుమెంట్ తీసుకొని వస్తే ఎవరికైనా సమాధానం చెబుతామన్నారు. ఎవరైనా మేథావులు లేదా ఇతరులు తన వద్దకు వస్తే చెబుతామన్నారు. అపాయింటుమెంట్ తీసుకొని వస్తే వివరణ ఇస్తామన్నారు.

ప్రత్యేక హోదాపై..
ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి ఇబ్బంది పడటం లేదని చెప్పారు. హోదా పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నారు. హోదాతో ప్రయోజనం లేదనే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించామని చెప్పారు.
హోదాతో అదనంగా వచ్చేది 30 శాతం నిధులేనని, ప్యాకేజీతో దాని కంటే ఎక్కువ వస్తున్నాయని సుజన చెప్పారు. రాష్ట్రానికి తాము సాధించినంత ఇంకెవరు సాధించలేదని చెప్పారు. తలుత హోదాను తాము కూడా గట్టిగా అడిగామని చెప్పారు. ఆ తర్వాత ప్యాకేజీ బెట్టర్ అని తెలిసిందన్నారు.
ఏపీకి రావాల్సిన నిధులు రావడం ప్రారంభమైందన్నారు. ఇందుకోసం కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులకు తాను కృతజ్ఞతలు చెబుతానని అన్నారు. వాళ్లు చాలా సహకరించారని చెప్పారు. పనిలేని పార్టీలు ప్రత్యేక హోదాను వివాదం చేస్తున్నాయన్నారు.

జగన్ జైలుకెళ్తాడో..
వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ జైలుకు వెళ్తాడో లేక చర్చికి వెళ్తాడో తమకు తెలియదన్నారు. ఆయనను జైలుకు పంపించాల్సిన అవసరం తమకు ఏమాత్రం లేదని సుజనా చౌదరి చెప్పారు.

లోకేష్‌తో విభేదాల్లేవు, పార్టీలో నెంబర్ 2 కాదు
తనకు మంత్రి, టిడిపి యువనేత నారా లోకేష్‌తో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. లోకేష్ ఎదిగే నేత అన్నారు. తాను పార్టీలో నెంబర్ 2 కాదని సుజన చెప్పారు. పార్టీలో తనకు ఎవరూ శత్రువలు లేరని చెప్పారు. టిడిపికి కాంగ్రెస్ లక్షణాలు రాలేదన్నారు.

టిడిపిలో నా చేరిక అసూయ కలిగించిందేమో
పదవులు ఆశించి, అవి రాకుంటే ఎవరైనా బురద జల్లే ప్రయత్నం చేస్తారన్నారు. టిడిపిలో తాను చేరడం కొంతమందికి అసూయ కలిగించి ఉండవచ్చునని చెప్పారు.

వైసిపిలో ఓ గ్రూప్ టిడిపిలో చేరింది..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఓ గ్రూప్ తెలుగుదేశం పార్టీలో చేరిందని సుజనా చౌదరి అన్నారు. వాళ్ల అధినేతతో విభేదించి వారు తమ పార్టీలో చేరారని చెప్పారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పోగు చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు.
సామాజిక సమతౌల్యం కోసమే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు అన్నారు. అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలనే పార్టీలో మార్పులు అన్నారు.

శివప్రసాద్ అసంతృప్తిపై.. సీనియర్ల అసహనంపై..
చిత్తూరు ఎంపీ శివప్రసాద్ చెప్పినవి కరెక్టో కాదో తనకు తెలియదని చెప్పారు. దళితులకు అన్యాయం జరిగిందన్న శివప్రసాద్ క్లారిటీ తీసుకుంటే బాగుండేదన్నారు. ఏజ్ ఎక్కవై సహనం కోల్పోయిన వాళ్లే అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఇచ్చినప్పుడు సంతోషపడి, ఇవ్వనప్పుడు ఏడవటం సరికాదన్నారు.

మోడీ కేబినెట్లో..
మోడీ భారత ప్రధాని అని, మోడీ ఎన్నికల టీంలో తాము ఉండమన్నారు. ఎందుకంటే తమది తెలుగుదేశం పార్టీ అని, తమ నాయకుడు చంద్రబాబు అన్నారు. తమ పార్టీ అధ్యక్షులు ఏం చెబితే అదే చేస్తామని చెప్పారు. తనది చంద్రబాబు వాదం, టిడిపి సిద్ధాంతం అన్నారు.
పోర్ట్ పోలియే ఏదైనా ఒకటేనని చెప్పారు. అయితే రాష్ట్రానికి మరింత మంచి చేసే పోర్ట్ పోలియే అయితే మరింత సంతోషమని చెప్పారు. పోర్ట్ పోలియే ప్రధాని మోడీ ఇష్టమని చెప్పారు. రాష్ట్రంలో అయితే చంద్రబాబు ఇష్టమని వ్యాఖ్యానించారు.

పోలవరం కమీషన్ల కోసం కాదు..
పోలవరం ప్రాజెక్టు కమీషన్ల కోసం కాదని సుజనా చౌదరి అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత లేదని చెప్పారు. ప్రతిపక్షాల అనుచిత విమర్శలకు సమాధానం చెప్పమని తెలిపారు. తాను విభజన చట్టానికి సంబంధించి ఎంతో స్టడీ చేశానని, కేజీ టు పీజీ కూడా ఇంత చదవలేదని చెప్పారు.
నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్నారు. అది చట్టపరంగానా లేక రాజ్యాంగ సవరణా అనేది త్వరలో తేలుతుందన్నారు. విశాఖకు రైల్వే జోన్ వస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications