టీడీపీతో బీజేపీ పొత్తు - కమలం ముఖ్య నేత క్లారిటీ : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైనా..!!
ఏపీలో ముందస్తు ఎన్నికలు..పొత్తుల పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇంకా ఎన్నికలకు సమయం ఉందని చెబుతూనే..ముందస్తుగానే పొత్తుల సర్దుబాట్ల పైన అంతర్గతంగా ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని వైసీపీ బలంగా నమ్ముతోంది. టీడీపీ - జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం సైతం అదే అంచనాతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా కుప్పం పర్యటనలో చంద్రబాబు మాత్రం పొత్తుల పైన ఇప్పుడు మాట్లాడనని..ఇంకా, సమయం ఉందని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతానికి జనసేనతోనే
ఇదే సమయంలో..బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ ఏపీలో పొత్తుల అంశం పైన స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ..టీడీపీ పార్టీలు మతతత్వ, కుటుంబ పార్టీలని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందన్నారు. మోడీ పాలనలో దేశం సుభిక్షంగా పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే అభివృద్ధి చేయగలదని అన్నారు. రాష్ట్రాన్ని బంగారు ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకే జనసేనతో కలిసి ముందుకెళ్తున్నామని చెప్పారు.

ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చబోమన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని సునీల్ దేవథర్ విశ్లేషించారు. బీజేపీతో కాకుండా మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటానంటూ ఆయన చెప్పలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం జనసేనతో కలిసే ఉన్నాం.. కలిసే ఉంటాం.. మరో పొత్తు ప్రస్తావనకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. అవినీతి, రౌడీయిజమే కాకుండా రాష్ట్రాన్ని అర్థిక కష్టాల్లోకి నెట్టేసిన పార్టీని ఓడించాలనుకునే పార్టీలు.. తమతో కలవాలని పవన్ కు పిలుపునిచ్చారు.

ఏపీలో మారుతున్న సమీకరణాలు
అయితే, గత వారం కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ తాము ప్రస్తుతం బీజేపీతో పొత్తుతో ఉన్నామని పవన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అని చెప్పటం ద్వారా కొత్త ఆలోచనల్లో పవన్ ఉన్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో జగన్ ఓటమే లక్ష్యంగా అటు చంద్రబాబు - ఇటు పవన్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోందనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే, ఈ నెలలో జరిగే మహానాడులో టీడీపీ రాజకీయ తీర్మానంలో చర్చలో భాగంగా పొత్తుల అంశం పైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.