ఆ కేసు వారంలోగా తేల్చండి .. హైకోర్టుకు సుప్రీం ఆదేశం .. తుళ్ళూరు భూముల కేసులో కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు భూముల కేసులో సుప్రీం ధర్మాసనం ఈరోజు కీలక వ్యాఖ్యలు చేసింది. తుళ్లూరు మాజీ తహసిల్దార్ అన్నే సుధీర్ బాబు కేసును వారంలోగా తేల్చాలని ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. తుళ్లూరులో పేదలను మభ్యపెట్టి భూ కుంభకోణానికి పాల్పడ్డారన్న వ్యవహారంపై ఏపీ సిఐడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ దర్యాప్తుపై ఏపీ హైకోర్టు స్టే ఇవ్వటం ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసినవే .ఈ కేసులో తాజాగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది.

తహసీల్దార్ అన్నే సుధీర్ బాబు కేసు వారంలోగా తేల్చాలని ఆదేశించిన సుప్రీం కోర్టు
తుళ్ళూరు భూముల వ్యవహారంలో సిఐడి దర్యాప్తు పై స్టే ఇవ్వాలని తుళ్లూరు మాజీ తహసిల్దార్ అన్నే సుధీర్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసుతోపాటు,పలువురిపై సిఐడి దర్యాప్తును ఆపివేయాలని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులను ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యలు ఏపీ సర్కార్ కు అనుకూలంగా ఉండడంతో ఏపీ ప్రభుత్వ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

స్టే ఎలా విధిస్తారని విస్మయం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం
ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఈ తరహా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించింది . అసలు ఈ అంశంలో కేసు ఏముందని, హైకోర్టు వ్యాఖ్యలు ఎలా చేస్తుందని విస్మయం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం, చట్టబద్దమైన దర్యాప్తుపై స్టే విధించవద్దు అని మేము అనేక మార్లు చెబుతూనే వస్తున్నాము అంటూ పేర్కొంది. అంతేకాదు చట్టం తన పని తాను చేసుకునేలా ఉండాలని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఎస్సీ, ఎస్టీ రైతులను బెదిరించి భూములు లాక్కొన్న ఆరోపణలు ..సిఐడీ దర్యాప్తు
ఎస్సీ, ఎస్టీ రైతులను బెదిరించి అసైన్డ్ భూములను మాజీ తహసీల్దార్ అన్నే సుధీర్ బాబు, బ్రహ్మానంద రెడ్డి కలిసి లాక్కున్నారన్న అభియోగాలతో సిఐడి విచారణ జరుపుతోంది. మాజీ తహసిల్దార్ అన్నే సుధీర్ బాబు, బ్రహ్మానంద రెడ్డిలు తమ భూములు ఇవ్వకుంటే ల్యాండ్ పూలింగ్ కు భూములు పోగొట్టుకోవాల్సి వస్తుందని రైతులను బెదిరించి పేదల భూముల బదలాయింపు చేసుకున్నారని , ఇదంతా ల్యాండ్ పూలింగ్ కు ముందే జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. నిరుపేద రైతులు వీరి బెదిరింపులతో భూములను అమ్ముకోగా టిడిపి నేతలు సొంతం చేసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. రంగంలోకి దిగిన ఏపీ సిఐడి తుళ్లూరు భూముల కుంభకోణంపై విచారణ జరుపుతోంది. ఈ విచారణ కేవలం కక్షపూరిత చర్య అని , విచారణ ఆపాలని కోర్టును కోరటంతో ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది . తాజాగా సుప్రీం ధర్మాసనం ఈ కేసును వారం రోజుల్లోగా తేల్చాలని ఏపీ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.