వివాదాస్పద ఆధ్మాత్మిక గురు ప్రబోధానంద కన్నుమూత...
త్రైత సిద్దాంతకర్తగా ప్రచారం పొందిన ప్రబోధానంద స్వామి గురువారం(జూలై 9) కన్నుమూశారు. అనంతపురంలోని తాడిపత్రిలో ఉన్న చిన్నపొడమల ఆశ్రమంలో ఆయన తుది శ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను గురువారం ఆస్పత్రికి తరలిస్తుండగా తుది శ్వాస విడిచినట్లు సమాచారం.

అప్పట్లో జేసీతో వివాదం...
గతంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో వివాదంతో ప్రబోధానంద వార్తల్లో నిలిచారు. 2018లో వినాయక నిమజ్జనం సందర్భంగా గ్రామస్తులకు,ప్రబోధానంద ఆశ్రమ వాసులకు మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఇదే వివాదంపై గ్రామస్తులకు మద్దతుగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆందోళన చెపట్టి, పోలీసుల తీరుపై మండిపడ్డారు.ఈ నేపథ్యంలోనే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవచనాలు చెబుతున్నారంటూ ఆయనపై అప్పట్లో కేసు కూడా నమోదైంది.

ప్రబోధానంద నేపథ్యం...
నిజానికి ప్రబోధానంద అసలు పేరు పెద్దన్న చౌదరి. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లె గ్రామంలో 1950లో జన్మించారు. మొదట్లో ఇండియన్ ఆర్మీలో వైర్లెస్ ఆపరేటర్‌గా పనిచేశారు. ఆర్మీ నుంచి వచ్చాక తాడిపత్రిలోనే కొన్నేళ్లు ఆర్ఎంపీగా పనిచేశారు. ఆ సమయంలో ఆయుర్వేదంపై పలు పుస్తకాలు రాశారు. అలాగే ఆధ్యాత్మిక అంశాలపై కూడా పలు పుస్తకాలు రాశారు. అలా కొన్నాళ్లుగా ఆయనే ఆధ్యాత్మిక గురువుగా మారిపోయారు.

త్రైత సిద్దాంత ప్రచారం...
తాడిపత్రి మండలం, చిన్నపొడమల గ్రామంలో శ్రీకృష్ణ మందిరాన్ని స్థాపించిన ప్రబోధానంద.. మానవులందరికీ దేవుడు ఒక్కడేనని, భగవద్గీత, బైబిల్, ఖురాన్లో ఉన్న దైవజ్ఞానము ఒక్కటేనని, త్రైత సిద్ధాంతం ఇదే చెబుతుందని ప్రచారం చేశారు. అయితే ఆయన ఆశ్రమంలో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయని జేసీ లాంటి నేతలు గతంలో ఆరోపించారు. కానీ ప్రబోధానంద మాత్రం వాటిని ఖండించారు.అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లయితే ఆశ్రమానికి ఇంత మంది ప్రజలు ఎందుకొస్తారని అప్పట్లో జేసీని ప్రశ్నించారు. నిరక్షరాస్యులు మొదలు పెద్ద పెద్ద ఐఏఎస్‌లు,ఐపీఎస్‌లు తన దగ్గరకొచ్చేవారని చెప్పారు.