చంద్రబాబుకు పోరాడే దమ్ములేదు; వచ్చే ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా సమాధి: స్పీకర్ తమ్మినేని సీతారాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకీ వేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల వేడి ఇప్పటినుండే ఏపీలో కనిపిస్తుంది. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో జరగనున్న పొత్తులపై ఇప్పటి నుండే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తుల రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైసీపీ మంత్రులు, నేతలు ఇరుపార్టీలపై, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

చంద్రబాబు చేస్తున్నవి అసమర్ధుడి అంతిమ యాత్రలు
తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేస్తున్నవి అసమర్ధుడి అంతిమ యాత్రలు అని పేర్కొన్న తమ్మినేని సీతారాం ఒంటరిగా పోరాడే దమ్ము లేక పొత్తు పెట్టుకోవడం కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నాడు అంటూ మండిపడ్డారు. సింహం సింగిల్ గానే వస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతారని, ప్రజల మద్దతు ఆయనకు ఉందని వ్యాఖ్యానించారు .

గత ఎన్నికలలో ఏపీ ప్రజలు ఇచ్చిన షాక్ నుండి చంద్రబాబు ఇంకా కోలుకోలేదు
చంద్రబాబు హైదరాబాద్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ను ఏం చెయ్యాలో అర్ధం కాక స్టార్ హోటల్ గా మార్చుకున్నారని వ్యాఖ్యానించిన తమ్మినేని సీతారాం చంద్రబాబు హైదరాబాద్ ని వదిలి ఏపీకి రారంటూ పేర్కొన్నారు. గత ఎన్నికలలో ఏపీ ప్రజలు ఇచ్చిన షాక్ నుండి చంద్రబాబు ఇంకా కోలుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా సమాధి కాబోతుందని తమ్మినేని సీతారాం అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసిపి కేడర్లో ఎక్కడా అసంతృప్తి లేదని, తమలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటామంటూ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.

గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమం చేపట్టబోతున్నాం
రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు గడపగడపకు అందేలా చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమం చేపట్టబోతున్నామని తెలిపిన తమ్మినేని సీతారాం అర్హత కలిగిన వారికి పథకాలు అందకపోతే ఈ కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని వెల్లడించారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం, ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని పేర్కొన్న తమ్మినేని ప్రతిపక్షాల మాటలను ప్రజలు నమ్మబోరని తేల్చి చెప్పారు.

సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా చూస్తాం
నిత్యం ఏదో ఒక విషయంలో రాద్దాంతం చెయ్యటం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందన్న తమ్మినేని సీతారాం ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తాము ప్రకటించిన సంక్షేమ పథకాల్ని అందరికీ సమయానికి అందిస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. చంద్రబాబుకు జగన్ అందిస్తున్న సంక్షేమం చూసి ఏం చెయ్యాలో దిక్కు తోచటం లేదని, అందుకే పొత్తుల రాజకీయాలకు తెర తీశారని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.