మగాడు మృగంగా మారితే ఆ పని చెయ్యాలని, సజ్జనార్ ను గుర్తు చేసి.. స్పీకర్ తమ్మినేని సీతారాం షాకింగ్ కామెంట్స్
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రత విషయంలో,మహిళలపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో తనదైన శైలిలో స్పందించిన ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. శ్రీకాకుళం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో దిశ యాప్ పై జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన తమ్మినేని సీతారాం అత్యాచార ఘటనలకు పాల్పడే వారిపై తీవ్రంగా స్పందించారు.

అత్యాచారాలకు పాల్పడిన వారిని భూమ్మీద లేకుండా చెయ్యాలి
మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని భూమ్మీద లేకుండా చేయడమే సరైన శిక్ష అంటూ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. అంతేకాదు అవుట్ ఆఫ్ ది లా అమలు చేస్తేనే సమాజంలో న్యాయం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మీ 'లా' లు ఏం చేస్తున్నాయో తనకు తెలియదని పేర్కొన్న తమ్మినేని సీతారాం సమాజానికి రక్షణగా ఉండవలసిన మగాడు మృగంగా మారితే క్షమించకూడదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సమాంతర న్యాయం జరిగినప్పుడే అసలైన శిక్ష పడినట్టు
ఇదే సమయంలో ఎక్కడో ఒక దగ్గర మహిళలపై దాడులకు పుల్ స్టాప్ పడాలని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను మరోసారి అభినందిస్తున్నాను అంటూ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు . చట్టాలు ఏం చేస్తాయో తనకు తెలియదని, సమాంతర న్యాయం జరిగినప్పుడు అసలైన శిక్ష పడినట్టు అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక సమాజంలోనూ ఆలోచనాధోరణి మారాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలంగాణలో దారుణ అత్యాచార ఘటన .. న్యాయం చేసిన సజ్జనార్ కు కితాబిచ్చిన స్పీకర్
హైదరాబాదు శివార్లలో దిశ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని తీసుకు వచ్చారని, మహిళల రక్షణకు పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఈ సందర్భంగా గతంలో తెలంగాణలో జరిగిన యువతిపై దారుణ అత్యాచార ఘటనను, సజ్జనార్ హయాంలో జరిగిన సమాంతర న్యాయాన్ని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తావించారు.
స్పీకర్ హోదాలో చట్టపరిధిలో, రాజ్యాంగబద్ధంగా ఏదైనా జరగాలి అని చెప్పవలసిన తమ్మినేని సీతారాం చట్ట పరిధిని దాటి వెళ్ళాలి అని చెప్పడం ఇప్పుడు విమర్శలకు కారణమవుతుంది.