పొత్తులు పెట్టుకుంటే పొట్టలో కత్తులు పెట్టుకున్నట్టే; ప్రతిపక్షాల సర్కస్ ఫీట్లంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి నుండే ఎన్నికల వేడి కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై వాడి వేడి చర్చ జరుగుతుంది. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకొని ఎన్నికల రాజకీయాలు చేస్తారు అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. తాజాగా తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయని, ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగి జగన్ ను ఓడించలేరని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏపీలో పొత్తుల రాజకీయాలపై, తెలుగుదేశం పార్టీతో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో మండిపడ్డారు.

ఏపీలో ప్రతిపక్ష పార్టీలు ఫిలాసఫీ లేని పార్టీలు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీతో సహా ఇతర పార్టీలన్నీ ఫిలాసఫీ లేని పార్టీలని, ఒక పాలసీ.. ఒక విధానం లేకుండా పొత్తు పెట్టుకుంటే పొట్టలో కత్తులు పెట్టుకున్నట్టేనని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం పొలిటికల్ ఫిలాసఫీతో ఉన్నారని అందుకే సంక్షేమమే ధ్యేయంగా ఆయన పని చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ప్రజల మద్దతుతో ముందుకు వెళ్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.

వైసీపీ ప్రజా క్షేత్రంలో.. టీడీపీ పొత్తుల రాజకీయాల్లో
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికీ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ, పూర్తి పారదర్శకంగా అర్హులను గుర్తించి పథకాలను ఇస్తున్నారని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడానికి వైసిపి ప్రయత్నం చేస్తుంటే, టీడీపీ మాత్రం పొత్తుల రాజకీయాలు చేస్తుంది అంటూ విమర్శించారు. పిల్లల విద్య కోసం విద్యా దీవెన, నాడు నేడు, అమ్మఒడి వంటి కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసిపి ప్రభుత్వమని ఆయన తేల్చి చెప్పారు.

అందరూ ఎలా కలిసినా సరే సీఎం జగన్ ను ఎదుర్కోలేరు
గతంలో జన్మభూమి కమిటీలు ఇచ్చింది ఫైనల్ లిస్ట్ అని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులకు నేరుగా ఖాతాలోకే పథకానికి సంబంధించి డబ్బు చేరుతుందని తమ్మినేని సీతారాం వెల్లడించారు. అందరూ ఎలా కలిసినా సరే సీఎం జగన్ ను ఎదుర్కోలేరని ఆయన తేల్చి చెప్పారు. గ్రామంలో పరిపాలన ఉండాలన్న ఉద్దేశంతో పాలనను సీఎం జగన్ డీ సెంట్రలైజ్ చేశారని వెల్లడించారు. వైసిపి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని, రాజకీయ మధ్యవర్తులు లేకుండా పథకాలు నేరుగా ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.

నారాయణ వ్యవహారంలో చంద్రబాబును టార్గెట్ చేసిన తమ్మినేని సీతారం
మాజీ మంత్రి నారాయణ కేసు గురించి మాట్లాడుతూ చంద్రబాబును టార్గెట్ చేశారు. నారాయణ కేసుపై చంద్రబాబు చేస్తున్న హడావిడి చూస్తుంటే ప్రశ్నాపత్రాల లీకేజీ ని చంద్రబాబు సమర్ధిస్తున్నారా? అంటూ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. చట్టం తన పని తానూ చేసుకు పోతుందని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. జగన్ పరిపాలన దెబ్బకు ప్రతిపక్షాలు ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి సర్కస్ ఫీట్లు చేస్తున్నాయని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ఏం చేసినా జగన్ ని ఎదుర్కోవడం కష్టమే అని తేల్చి చెప్పారు.