రఘురామ కృష్ణంరాజు తేడా.. మనిషే కాదు : తణుకు ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు
ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం పెను దుమారంగా మారింది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ లో వేటు వేసే దిశగా వైసిపి పావులు కదుపుతోంది.అయినా సరే రఘురామకృష్ణంరాజు మాత్రం తనదైన శైలిలో వైసీపీ నేతలకు దీటుగా సమాధానం చెబుతున్నారు.
నాకూ సీఎం జగన్ కు దూరం పెంచకండి .. ఈ గొడవలకు కారణం విజయసాయి రెడ్డినే : రఘురామ వ్యాఖ్యలు

వైసీపీ హై కమాండ్ తో దీటుగా రఘురామ పోరాటం
నిన్నటికి నిన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి కి లేఖ రాసిన రఘురామకృష్ణంరాజు ఆ లేఖలో రెండు కీలక అంశాల గురించి ప్రస్తావించారు. ఒకటి క్రిస్టియానిటీ కాగా, రెండవది తెలుగు భాషకు సంబంధించిన అంశం. ఈ అంశాల ప్రస్తావనతో జగన్ ను ఇరకాటంలో పెట్టిన రఘురామ బీజేపీకి దగ్గరయ్యే యత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది .వైసీపీ నేతలు ఎందరు ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నా రఘురామకృష్ణంరాజు ఏ మాత్రం తగ్గటం లేదు. భవిష్యత్ పరిణామాలు తనకి తెలిసినప్పటికీ ధీటుగా పోరాటం సాగిస్తున్నారు.

తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడిన ఎమ్మెల్యే
ఈ క్రమంలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రఘురామ కృష్ణం రాజు ఒక తేడా అంటూ ఆయనను అత్యంత పరుషంగా దూషించారు. అంతే కాదు ఆయనను తాము మనిషిలా కూడా గుర్తించడం లేదని వ్యాఖ్యలు చేశారు. రఘురామ కృష్ణంరాజు బీజేపీ కి వెళ్లాలని బాగా ఆశగా ఉందని,బిజెపిలో చేరుతున్నారు కాబట్టే ప్రధాని నరేంద్ర మోడీ భజన చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే మండిపడ్డారు.

బీజేపీ భజన అంటూ రఘురామను టార్గెట్ చేస్తున్న వైసీపీ
రఘురామ వేస్తున్న అడుగులు బీజేపీలో చేరతారనే విధంగానే కనిపిస్తున్న నేపథ్యంలో వైసిపి నాయకులు ప్రస్తుతం ఈ విషయంపై టార్గెట్ చేసి రఘురామకృష్ణంరాజు పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో రఘురామ మరింత దూకుడు పెంచి బిజెపికి దగ్గర అయ్యేలా వీడియో సాంగ్ ఒకటి రూపొందించ తాను ప్రధాని మోదీతో కలిసి ఉన్న ఫోటోలతో సాంగ్ విడుదల చేశారు. దీంతోనే తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు రఘురామని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ భజన అంటూ ఫైర్ అవుతున్నారు.

కళా వెంకట్రావుపై తణుకు ఎమ్మెల్యే విమర్శలు
అంతేకాదు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పైన కూడా ఆయన విమర్శల వర్షం కురిపించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బంధువులు వందల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ చేశారంటూ తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆరోపణలు గుప్పించారు. కళా వెంకట్రావు మంత్రిగా ఉన్న సమయంలో ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన పేర్కొన్నారు. ఇక టిడిపి నాయకులు తణుకు నియోజకవర్గంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్న విషయంలో అనవసరంగా తనపై విమర్శలు గుప్పిస్తున్నారు అని, బురద చల్లటానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే నాగేశ్వరరావు.