టీడీపీ మాజీ మంత్రులపై బీజేపీ కన్ను- రేపు కళా వెంకట్రావు, ముద్రగడ పడాలతో సోము భేటీలు
ఏపీలో రాజకీయంగా అనుకూలంగా ఉన్న పరిస్ధితులను వాడుకుంటూ బలపడేందుకు బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే సోము వీర్రాజు రాక తర్వాత పరిస్ధితిలో మార్పు కనిపిస్తుండగా.. కొత్త ఏడాదిలో పార్టీని బలోపేతం చేసేందుకు మరిన్ని వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ముందుగా టీడీపీకి చెందిన మాజీ మంత్రులు కళా వెంకట్రావు, ముద్రగడ పద్మనాభం, పడాల అరుణతో భేటీ కావాలని సోము వీర్రాజు నిర్ణయించారు. రేపు వారి ఇళ్లకు వెళ్లి మరీ కలిసేందుకు సోము సిద్దమవుతున్నారు. అదే జరిగితే టీడీపీకి భారీ షాక్ తప్పకపోవచ్చు.

ఏపీలో బలోపేతానికి బీజేపీ భారీ వ్యూహం
ఏపీలో తాజాగా చోటు చేసుకున్న విగ్రహాల విధ్వంసం తర్వాత అనుకూలంగా మారిన పరిస్ధితులను సొమ్ము చేసుకునేందుకు బీజేపీ వ్యూహరచన ప్రారంభించింది. ఇందులో భాగంగా సంక్రాంతి తర్వాత పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పార్టీ ఛీఫ్ సోము వీర్రాజు ఇప్పటికే ఓ వ్యూహాన్ని సిద్ధం చేశారు. దీని ప్రకారం ముందుగా ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలపై సోము గురి పెడుతున్నారు. రేపు వారి ఇళ్లకు వెళ్లి మరీ పార్టీలో చేరాలని ఆహ్వానించబోతున్నారు.

టీడీపీ మాజీ మంత్రులపై కన్ను
టీడీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులు కళా వెంకట్రావు, ముద్రగడ పద్మనాభం, పడాల అరుణ ముగ్గురినీ ఆకర్షించేందుకు బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజు సిద్దమవుతున్నారు. వీరిలో కళా వెంకట్రావు అయితే నిన్న మొన్నటి వరకూ ఏపీ టీడీపీ ఛీఫ్‌గా కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ ఆయన స్ధానంలో అచ్చెన్నాయుడుకు బాధ్యతలు కట్టబెట్టింది. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పడాల అరుణ కొంతకాలంగా రాజకీయంగా మౌనంగానే ఉంటున్నారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీకి మద్దతిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలతో మనస్తాపం చెంది కాపు ఉద్యమం నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు వీరిద్దరినీ బీజేపీలోకి తీసుకురావాలని సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నారు.

కాపు నేతలపైనే దృష్టి ఎందుకంటే ?
ఏపీలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు టీడీపీ, వైసీపీకి మద్దతుగా ఉన్నాయి. ఎటొచ్చీ కాపులు మాత్రమే ఎటూ తేల్చుకోలేని పరిస్ధితుల్లో ప్రతీ ఎన్నికల్లో వీరిద్దరిలో ఎవరో ఒకరికి మద్దతిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పటికీ ఆయన్ను నమ్మి బీజేపీకి మద్దతిచ్చేందుకు వారు సిద్దం కాలేదు. అలాగని జనసేనాని పవన్ కళ్యాణ్‌కు మద్దతిచ్చేందుకు కూడా కాపులు సిద్ధపడలేదు. దీంతో వీరిద్దరికీ నిరాశ తప్పలేదు. ఇప్పుడు కాపులను భారీ ఎత్తున ఆకర్షించగలిగితే బీజేపీని బలోపేతం చేయొచ్చని ఆ పార్టీ అంచనా వేసుకుంటోంది.

పవన్ మద్దతుతో బీజేపీ వ్యూహాలు
గతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కాపులు ఆయన్ను నమ్మలేదు. అలాగే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేననూ నమ్మలేదు. దీంతో వైసీపీవైపు ఏకపక్షంగా ఓటేశారు. కానీ ఇప్పుడు బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. దీంతో పాటు తమకు మద్దతిస్తే కాపులకు న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఓవైపు పవన్, మరోవైపు సోము వీర్రాజు కాపులను ఆకర్షించే పనిలో ఉన్నారు. ఈ ప్రయోగం ఎంత వరకూ ఫలిస్తుందో తెలియకపోయినా ప్రస్తుతానికి పవన్ కంటే సోము వీర్రాజును నమ్మి కాపులు బీజేపీకి మద్దతిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.