ఢిల్లీలో స్పెషల్ స్టేటస్ v/s ఈడీ కేసెస్.. జగన్ నటనకు మోసకార్ అవార్డు : టీడీపీ గేమ్ స్టార్ట్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. విభజన సమస్యల పరిష్కారానికి నియమించిన సబ్ కమిటీ ఎజెండాలో ప్రత్యేక హోదా చేర్చి మళ్లీ కేంద్రం తొలగించడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతకాని తనం వలనే ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించిందని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రత్యేక హోదాపై మోసం చేసిన జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

కేసుల మాఫీ కోసం ప్రజల ఆకాంక్షలు తాకట్టు
ఏపీ ప్రజల ఆకాంక్షలను సీఎం జగన్ తన కేసుల మాఫీ కోసం కేంద్రానికి తాకట్టుపెట్టారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఆస్కార్ అవార్డుకు మించి జగన్ నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన నటనకు మోసకార్ అవార్డు ఇవ్వాల్సిందేనని సెటైర్లు వేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ తన పెయిడ్ ఆర్టిస్టులతో హోదా డ్రామాలాడి ఇప్పుడు నోరు మెదపడం లేదు. తాడేపల్లి నుంచి డిల్లీ వరకు ప్రత్యేక హోదాను ఎక్కడా వినిపించకుండా బ్యాన్ చేశారని దుయ్యబట్టారు.

పదవులకు రాజీనామా చేయండి..
ప్రత్యేక హోదాపై వైసీపీ లోపాయికారితనం, చేతకానితనం మరోసారి రాష్ట్ర ప్రజలకు బహిర్గతమైందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా కోసమంటూ యువ భేరీల నిర్వహించి యువతను మోసం చేసిన జగన్.. యువతకు క్షమాపన చెప్పాలన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చనపుడు ప్రజలిచ్చిన పదవుల్లో కొనసాగే అర్హత సీఎం జగన్, వైసీపీ ఎంపీలకు లేదన్నారు. వెంటనే వారు ఆ పదవులుకు రాజీనామా చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

స్పెషల్ స్టేటస్ వర్సెస్ ఈడీ కేసెస్
ఏపీకి ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి మోదీతో ఏం మాట్లాడారో స్పష్టం చేయాలని ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. జగన్ రిప్రజెంటేషన్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదన్నారు. ప్రత్యేక హోదా రావాలని జగన్‌కు లేదని విమర్శించారు. దేశ రాజధాని ఢిల్లీలో స్పెషల్ స్టేటస్ వర్సెస్ ఈడీ కేసెస్‌ల ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీకి, వైసీపీకి దృఢమైన సంబంధం ఉందన్నారు. ప్రతి బిల్లుకు వైసీపీ ఎంపీలు మద్దతు తెలుపుతున్నారని పయ్యావుల ఆరోపించారు. సీఎం జగన్ మౌనం వీడితే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని పేర్కొన్నారు.