జగన్‌కు రాజధాని ముళ్లకంప..అవినీతి ముద్ర వారిదే:భూముల ధరలు పడిపోయాయి: చంద్రబాబు ఫైర్..!
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వ తీరును ప్రతిపక్ష నేత చంద్రబాబు తప్పు బట్టారు. సభలో అమరావతి కి ప్రపంచ బ్యాంకు రుణం నిలుపుదల మీద చర్చ జరిగింది. చంద్రబాబు ప్రసంగం తరువాత మంత్రి బుగ్గన వివరణ ఇచ్చారు. మరోసారి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ ప్రతిపక్షం స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేసారు. ఆ తరువాత స్పీకర్ సభను వాయిదా వేసారు. దీంతో..మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్ష నేత చంద్రబాబు తన వాదన వినిపించారు. ఏపీ రాజధాని అమరావతి తమది అనే భావన వైసీపీ నేతలకు లేదని..ఇప్పటికీ అమరావతిని భ్రమరావతి అంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
అవినీతి ముద్ర వారిదే..మాకు అంటించాలని..
తొలి నుండి వైసీపీ నేతలకు అమరావతి మీద వ్యతిరేక భావం ఉందని చంద్రబాబు ఆరోపించారు. అమరావతిలో ముళ్లు..కంప తప్ప ఇంకేముంది అంటున్నారని గుర్తు చేసారు. రాజధానిలో ఉంటే వైసీపీ నేతలకు ముళ్లకంపపై ఉన్న ట్టుందేమోనని వ్యాఖ్యానించారు. అమరావతికి పెట్టుబడులు రాకుండా వైసీపీ నేతలు ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. ప్రపంచ బ్యాంకుకు పదేపదే లేఖలు రాశారని విమర్శించారు. వైసీపీకి ఉండే అవినీతి ముద్ర టీడీపీపై నెట్టాలని చూస్తున్నారని అన్నారు. రాజధాని అమరావతిలో గజం రూ.64 వేలు ఉన్న భూమి విలువ ఇప్పుడు రూ.20 వేలకు పడిపోయిందన్నారు. వైసీపీ పనుల వల్ల భూముల విలువ మరింత పడిపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రయాన్‌కు రూ.1000 కోట్లు దండగని జగన్ అంటారేమోనని, చంద్రయాన్‌కు కేటాయించిన రూ.1000 కోట్లలో అవినీతి అంటారని అనుమానం వ్యక్తం చేశారు.

రాజధాని కోసం ఎంతో కష్టపడ్డాం..
తన హయాంలో రాజధాని కోసం ఎంతో కష్టపడ్డామని చంద్రబాబు వివరించారు. ఇప్పుడు అదే రాజధానిపైన వైసీపీ రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. రాజధాని కోసం భూముల సమీకరణ..పేరు ఖరారు..ప్రణాళికలు అన్ని పక్క ప్రణాళికా బద్దంగా వ్యవహరించామని చెప్పుకొచ్చారు. అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. పెద్ద నగరాల వల్లే ఆదాయం వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతిని మొదటి నుంచి వైసీపీ కాంట్రవ ర్సీ చేస్తోందని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ల్యాండ్‌పూలింగ్ చేశామన్నారు.రాజధాని నిర్మాణం కోసం రైతులు ఉదారతతో 34వేల ఎకరాల భూమి ఇచ్చారని చంద్రబాబు అన్నారు. అప్పుడు కూడా భూమి ఇవ్వొద్దని రైతులను వైసీపీ రెచ్చగొట్టిందని, వైసీపీ కార్యకర్తలు రైతుల పంటపొలాలు తగులబెట్టారని.. కోర్టులకెక్కి అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు యత్నించారని చంద్రబాబు ఆరోపించారు. రైతులు ఎవరైనా తాము చేసిన విధానం పైన తప్పు అని చెబితే దేనికైనా సిద్దమని చంద్రబాబు స్పష్టం చేసారు.