తిరుపతి ఉపఎన్నికకు చంద్రబాబు భారీ స్కెచ్- ట్రాప్‌లో పడుతున్న జగన్ ? ఫ్లాష్‌బ్యాక్ రిపీట్!
అజెండా సెట్ చేసిన వాడే అంతిమంగా విజేత అవుతాడు. రాజకీయాల్లో తరచూ వినిపించే వ్యాఖ్య ఇది. ఏపీలో గతానుభవాలు కూడా ఇదే చెప్తున్నాయి. ఇప్పుడు తిరుపతిలో త్వరలో జరిగే ఉప ఎన్నిక సీన్ చూస్తుంటే ఈ నానుడి నిజమైనా ఆశ్చర్యం లేదనేలా కనిపిస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల బరిలోకి అందరి కంటే ముందుగా దిగిన టీడీపీ ఇప్పుడు అక్కడ అజెండా సెట్ చేసేసినట్లే తెలుస్తోంది. అందుకు తగినట్లుగా సీఎం జగన్‌నూ, వైసీపీని అందులోకి లాగడంలోనూ చంద్రబాబు ముందుంది. గతంలో ప్రత్యేక హోదాను తెరపైకి తెచ్చి తనను కార్నర్ చేసిన జగన్ బాటలోనే వెళ్లి ఇప్పుడు ఆయనకు ముచ్చెమటలు పట్టించాలన్నది చంద్రబాబు వ్యూహం.

తిరుపతి ఉపఎన్నికల సీన్
ఏపీలో త్వరలో జరిగే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక వైసీపీకి నల్లేరుమీద నడకేనని అందరూ భావిస్తున్న వేళ.... విపక్ష టీడీపీ రంగంలోకి దిగింది. కొత్తగా తెచ్చిపెట్టుకున్న రాబిన్ శర్మ వ్యూహాలతో తిరుపతిలో అడుగుపెట్టిన టీడీపీ ఇప్పుడు అధికార పక్షానికి సవాళ్లు విసురుతోంది. తిరుపతి ఉప ఎన్నికను టీడీపీ ఇంత సీరియస్‌గా తీసుకుంటుంటే అధికార వైసీపీ మాత్రం లైట్ తీసుకుంటోంది..
అధికారంలో ఉన్నామనే ధీమా, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల జాతర, ఇతరత్రా కారణాలతో వైసీపీ అతి విశ్వాసంగా కనిపిస్తోంటే టీడీపీ, బీజేపీ వంటి విపక్షాలు చాపకింద నీరులా తిరుపతిలో తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అందులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఆయన స్కెచ్ చూస్తే ఇట్టే అర్ధమవుతోంది.

తిరుపతిలో చంద్రబాబు స్కెచ్ ఇదే
తిరుపతి ఉప ఎన్నిక కోసం చంద్రబాబు అందరి కంటే ముందే రంగంలోకి దిగారు. గతంలో ఇక్కడ ఓటమి పాలైన మహిళా అభ్యర్ధి పనబాక లక్ష్మికి మరోసారి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి అందరి కంటే ముందే తిరుపతి పోరును ప్రారంభించారు. క్షేత్రస్ధాయిలో పార్టీ కమిటీల ఏర్పాటు ద్వారా నియోజకవర్గాల్లో భారీ స్కెచ్ సిద్దం చేస్తున్నారు. అది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో లోటు పాట్లో, అభివృద్ధి లేమి అజెండానో కాదు అంతకు మించిన అజెండాను చంద్రబాబు సెట్ చేస్తున్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రం, ఆంధ్రులకే కాదు దేశవిదేశాల్లో హిందువులకు ఆరాధ్య దైవమైన తిరుమల వెంకటేశ్వరుడి సెంటిమెంట్, రాష్ట్రంలో గుళ్లపై దాడులు, విగ్రహాల ధ్వంసాలు, పుణ్యక్షేత్రాలను కాపాడుకోవాల్సిన అవసరం.. ఇలా ఒక్కో అంశం ఇప్పుడు టీడీపీ అజెండాలోకి వచ్చి చేరిపోతోంది.

రాబిన్ శర్మ ఫస్ట్ అసైన్మెంట్
ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్‌ను బిహారీ డెకాయిట్‌గా అభివర్ణించి ఆయన వ్యూహలు జగన్‌కు ఎందుకూ పనికిరావని విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయన శిష్యుడు రాబిన్ శర్మను తిరుపతి ఉపఎన్నికల బరిలోకి వ్యూహకర్తగా దింపారు. రెండు నెలల కిందటే తిరుపతిలో పాగా వేసిన రాబిన్ శర్మ ఇప్పుడు అక్కడ టీడీపీ వ్యూహాలకు తురుపుముక్కలా కనిపిస్తున్నాడు.
ఫస్ట్ అసైన్‌మెంట్‌లోనే చంద్రబాబుతో తిరుపతి ఉపఎన్నిక అజెండా సెట్ చేయించడంలో రాబిన్ శర్మ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. చంద్రబాబు తిరుపతిలో అజెండాను అందరి కంటే ముందే సెట్ చేయడంలో రాబిన్ వ్యూహాలే పనిచేశాయి. ఇప్పుడు అజెండా సెట్ అయింది ఇందులోకి జగన్‌ను లాగేదెలా అన్నది వారి ముందున్న వ్యూహం.

చంద్రబాబు ట్రాప్‌లోకి జగన్
ఎస్సీ రిజర్వుడు స్ధానమైనప్పటికీ తిరుపతి పార్లమెంటు సీటులో ఫలితాలను ప్రభావితం చేసేది ఇతర కులాల వారే. వారి సాయంతో ఇప్పుడు తిరుపతిలో అజెండాను సెట్ చేసిన చంద్రబాబు...అందులోకి వైఎస్ జగన్‌ను కూడా లాగేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తిరుపతిలో వైసీపీ కంటే ముందే అభ్యర్ధిని ఎంపిక చేసిన చంద్రబాబు, వ్యూహాల అమల్లోనూ ముందున్నారు. దీంతో తప్పనిసరిగా వైసీపీ కూడా అభ్యర్ధిని ప్రకటించాల్సిన పరిస్ధితి తలెత్తింది. సాధారణ పరిస్ధితుల్లో పనబాక లక్ష్మి గట్టి పోటీదారు కాకపోయినా ఆమె పేరు అభ్యర్ధిగా వినిపించగానే జగన్ అప్రమత్తం కావాల్సి వచ్చింది.
వెంటనే తన ఫిజియోథెరపిస్టు డాక్టర్ గురుమూర్తిని అక్కడ అభ్యర్ధిగా వైసీపీ ప్రకటించేసింది. వాస్తవానికి ఉప ఎన్నిక కోసం అభ్యర్ధులను ముందుగా ప్రకటించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ చంద్రబాబు పనబాక లక్ష్మి రూపంలో విసిరిన సవాలుకు గురుమూర్తి రూపంలో జవాబు వచ్చేసింది. అక్కడి నుంచి మొదలైన చంద్రబాబు ట్రాప్‌లో ఇప్పుడు జగన్, వైసీపీ అడుగడుగునా పడుతున్నాయనేది తిరుపతిలో వినిపిస్తున్న వాదన.

టీడీపీ, బీజేపీ కలిస్తే వైసీపీకి చుక్కలే...
అజెండా రెడీ అయిపోయింది. ఇక అమలు చేయడమే తరువాయి. దీంతో రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహాల విధ్వంసాలను తిరుపతికి ఎలా వాడుకోవాలన్నదే మిగిలుంది. ఊహించినట్లుగానే తిరుపతి పరిధిలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో ఈ అంశాలు హైలెట్ అయిపోతున్నాయి.
ఓవైపు టీడీపీ, మరోవైపు బీజేపీ, ఇంకోవైపు జనసేన.. ఇలా ముగ్గురూ తిరుపతిలో ప్రత్యేక కమిటీలతో పాగా వేసి మరీ ఈ అజెండాను హైలెట్ చేసే పనిలో పడ్డాయి. ఈ మూడు పార్టీలు కలిసి రాబోయే రోజుల్లో ఇదే అజెండాను భారీస్దాయిల్లో జనాల్లోకి చొప్పించగలిగితే తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీకి ముచ్చెమటలు పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

2019 సీన్ రిపీట్ అవుతుందా ?
గతంలో ఏపీ విభజన సందర్భంగా అప్పటి యూపీఏ సర్కారు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ కోసం 2014 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ చంద్రబాబుపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు. 2019 ఎన్నికలకు మా అజెండా ఇదే అని కూడా తేల్చిచెప్పారు. ఓ రకంగా 2019 సార్వత్రిక ఎన్నికల అజెండాను ముందుగానే జగన్ సెట్ చేసేశారు. ఇంకేముంది రెండేళ్లముందే ఆచరణలో కూడా పెట్టేశారు. ప్రత్యేక హోదాపై ప్రత్యేక బ్రోచర్లు, కరపత్రాలు వేసి జనంలోకి వదిలారు. యువభేరీలు నిర్వహించి యువతకు ప్రత్యేక హోదా అవసరం తెలియచెప్పారు. చివరికి ప్రత్యేక హోదా ఇవ్వని ఎన్డీయే సర్కారులో ఇంకా ఎందుకు కొనసాగుతున్నారంటూ చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు. చివరికి అది చినికి చినికి గాలి వానగా మారి ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి రావడానికి కారణమైంది. ఆ తర్వాత తనకు అంత సత్తా లేదని తెలిసినా చంద్రబాబు ఎన్డీయేను సవాల్ చేసి దారుణంగా దెబ్బతిన్నారు. అజెండా సెట్ చేసిన జగన్ ఘనవిజయం అందుకున్నారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని తిరుపతిలో అమలు చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.