చంద్రబాబు నాయుడు అరెస్ట్, పాదయాత్రకు అనుమతి లేదన్న పోలీసులు..
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు సహా వామపక్ష నేతలు, జేఏసీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచి చంద్రబాబు నాయుడు జేఏసీ నేతలతో పాదయాత్ర చేపట్టేందుకు బయల్దేరారు. అయితే ఆయన బృందాన్ని పోలీసులు బెంజ్ సర్కిల్ వద్ద అడ్డుకొన్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

బస్సుయాత్ర లేదంటే పాదయాత్ర..?
మందడం డీఎస్పీ ఆఫీసులో ఉన్న తమ మహిళా నేతల బస్సుయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరారు. లేదంటే పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు డిమాండ్లకు పోలీసులు ససేమిరా అంగీకరించలేదు. తన కాన్వాయ్‌లో తిరిగి వెళ్లాలని పోలీసులు చంద్రబాబుకు సూచించారు.

చంద్రబాబు అరెస్ట్
అందుకు ఆయన నిరాకరించడంతో చంద్రబాబు సహా నేతలను అరెస్ట్ చేశారు. అయితే వారిని ఎక్కడికిక తరలిస్తారన అంశంపై స్పష్టత లేదు. పోలీసుస్టేషన్ తీసుకెళ్తారా ? లేదంటే చంద్రబాబు నివాసానికి తరలిస్తారా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆటోనగర్ వెళ్తామంటే
మహిళా రైతుల బస్సులు ఉన్న ఆటోనగర్‌కు చంద్రబాబు వెళతానని చెప్పినా పోలీసులు అంగీకరించలేదు. పాదయాత్ర చేపడితే నగరంలో శాంతి భద్రతలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. చంద్రబాబు అక్కడే బైఠాయిచంగా... వారి బృందాన్ని పోలీసులు బస్సులో ఎక్కించి.. తరలిస్తున్నారు.

బస్సుయాత్రకు బ్రేక్
అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సు యాత్రకు పోలీసులు బ్రేకులేశారు. తూళ్లూరు వద్ద అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ బస్సులను పోలీసులు నిలిపివేశారు. వాస్తవానికి జేఏసీ ఆర్టీఏ పర్మిషన్ తీసుకొని బస్సుయాత్ర చేపడుతోంది. కానీ తమ అనుమతి కూడా తీసుకోవాలని.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ వెళతారో రూట్‌మ్యాప్ కూడా ఇవ్వమని పోలీసులు అడగడంతో.. బస్సుయాత్ర ఆగిపోయిన సంగతి తెలిసిందే.