జగన్ నీవాళ్లను కంట్రోల్లో పెట్టుకో.. లేకుంటే భారీ మూల్యం తప్పదు.. చంద్రబాబు వార్నింగ్
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలు బరి తెగించి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎం వైఎస్ జగన్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండలం, గుండ్లపాడులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత తోట చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రయ్య అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు. చంద్రయ్య కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

చంద్రయ్య పాడే మోసిన చంద్రబాబు
మాచర్లలో ఏం జరిగానా ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. చంద్రయ్య కుటుంబాన్ని నా కుటుంబంగా చూసుకుంటానని అన్నారు. పార్టీ తరుపున రూ. 25 లక్షలు సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చంద్రయ్య ఆశయం. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు నన్ను పిలవాలనుకుంటే చంద్రయ్య అంత్యక్రియలకు తాను రావాల్సి వచ్చిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని నేరస్థులు పాలిస్తున్నారు..
రాష్ట్రాన్ని నేరస్థులు పాలిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ మాదిరిగా టీడీపీ కూడా హత్యా రాజకీయాలు చేస్తే మిగిలేవారా ? అని ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన 33 మందిని వైసీపీ నేతలు పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నీ మనుషులను కంట్రోల్ పెట్టుకో.. లేకపోతే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రాన్ని హత్యా రాజకీయలతో నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రయ్యను చంపిన వారికి శిక్షపడాల్సిదే అని చంద్రబాబు డిమాండ్ చేశారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. హత్యా రాజకీయాలు చేసే వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు.

బ్రహ్మారెడ్డి రాకతో వైసీపీ నేతల్లో వణుకు ..
మాచర్ల ఇన్ ఛార్జీగా బ్రహ్మారెడ్డి రాకతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందన్నారు చంద్రబాబు. రౌడీలందరూ జాగ్రత్తగా ఉండండి ఖబడ్ధార్ అంటూ హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఖబడ్దార్.. నీలాంటి వాళ్లను చాలామందిని చూశామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల మీ జాగీర్ కాదు.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి అంటూ హెచ్చరించారు. బొండా ఉమా, బుద్దా వెంకన్నపై దాడిచేసిన రౌడీకి మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇస్తావా అని దుయ్యబట్టారు. మాచర్లలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించేదుకు వచ్చా.. అంటూ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. మున్ముందు వైసీపీ నేతలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు.