మోడీకి చంద్రబాబు కంగ్రాట్స్- సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై- అమరావతితో పోలుస్తూ
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇవాళ స్పందించారు. ఇవాళ ప్రధాని మోడీ ఈ ప్రాజెక్టుకు శంఖుస్ధాపన చేయనున్న నేపథ్యంలో ఆయన్ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.
న్యూ పార్లమెంట్- న్యూ ఇండియాకు శంఖుస్ధాపన చేస్తున్న సందర్భంగా ప్రధాని మోడీకి కంగ్రాట్స్ అంటూ చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇదో ప్రాముఖ్యమున్న ఘటనగా నిలిచిపోతుందన్నారు. ఐకానిక్ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దేశ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అన్ని హద్దులకు అతీతంగా అందరినీ ఐక్యం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చంద్రబాబు అమరావతితో పోల్చారు.

అమరావతిలో తాను ప్రతిపాదించిన ప్రభుత్వ భవనాల సముదాయం సెంట్రల్ స్పైన్ తరహాలోనే ఢిల్లీలోని సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కూడా ఉందని చంద్రబాబు తెలిపారు. రాజ్‌భవన్, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయంతో కూడిన అమరావతి సెంట్రల్ స్పైన్ ప్రాజెక్టు కూడా ఇలాంటిదేనని చంద్రబాబు గుర్తుచేశారు. రాష్ట్రం, దేశ అభివృద్ధి, సంపదలో భాగస్వామ్యం కోసం అమరావతి ఎదురుచూస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అమరావతి ఆశలు ఆవిరయ్యాయని, ఏపీలో వైసీపీ ప్రభుత్వమే ఇందుకు కారణమని చంద్రబాబు ఆరోపించారు. అమరావతి దేవుడి ఇష్టమని, దాని గమ్యాన్ని అదే వెతుక్కుంటుందని చంద్రబాబు వేదాంత ధోరణిలో వ్యాఖ్యానించారు.