andhra pradesh tdp development ysrcp welfare schemes counter chandrababu nara lokesh ys jagan టీడీపీ అభివృద్ధి వైఎస్సార్సీపీ సంక్షేమ పథకాలు చంద్రబాబు politics
వైసీపీ సంక్షేమానికి టీడీపీ అభివృద్ది కౌంటర్- మున్సిపోల్స్‌లో మారిన అజెండా-టార్గెట్ అదే
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా సంక్షేమ అజెండాకే పరిమితమైంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాల్సిన తరుణంలో దాని ఊసెత్తకుండా సంక్షేమ పథకాల జాతర కొనసాగిస్తోంది. రాష్ట్రంలో దారుణంగా దెబ్బతిన్న రహదారులకు కనీసం మరమ్మత్తులు కూడా చేయకుండానే రెండేళ్లుగా నెట్టుకొచ్చేసింది. రోడ్లే కాదు ఇతర మౌలిక సౌకర్యాల కల్పన కూడా మూలనపడేశారు.
కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాల ఊసేలేదు. దీంతో దాదాపు అన్నిచోట్లా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో ఇప్పుడు విపక్ష టీడీపీ తన బ్రాండ్ మార్క్ అభివృద్ధి అజెండాకు మరోసారి దుమ్ముదులుపుతోంది.

సంక్షేమం మాటున మాయమైన అభివృద్ధి
ఏపీలో సంక్షేమ పథకాల జాతర కొనసాగిస్తున్న వైసీపీ సర్కారు అభివృద్ధి విషయాన్ని ఎప్పుడో పక్కనపడేసింది. ఓట్లు కురిపించడంలో అభివృద్దితో పోలిస్తే సంక్షేమమే తమకు పనికొస్తుందని ఓ అంచనాకు వచ్చేసిన వైసీపీ సర్కారు నిత్యం ఏదో ఒక పథకం ప్రారంభోత్సవాలతోనే కాలం గడిపేస్తోంది. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు, ఉద్యోగాల కల్పన, మౌలిక సౌకర్యాల అభివృద్ధి వంటి కార్యక్రమాలు పడకేశాయి. దీంతో జనంతో పాటు ప్రభుత్వం కూడా తమకు కావాల్సింది ఇదే అన్న భావనలోకి వెళ్లిపోతున్న పరిస్ధితి. గతంలో సంక్షేమం, అభివృద్ధి రథానికి రెండు గుర్రాలుగా భావించే పరిస్ధితి నుంచి సంక్షేమంతోనే ఓట్లు వస్తాయన్న భావనలోకి ప్రభుత్వం వెళ్లిపోతున్న పరిస్ధితులు కనిపిస్తున్నాయి.

టీడీపీ బ్రాండ్ మార్క్ అభివృద్ధి అజెండా
టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్న సంక్షేమం కంటే అభివృద్ధి అజెండావైపే మొగ్గుచూపుతుంటుంది. అభివృద్ధితోనే గతంలో గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టే చంద్రబాబు 2004లో వైఎస్ సంక్షేమ అజెండా ఫలితాలతో మనసు మార్చుకున్నారు. దీంతో 2014 నాటికి సంక్షేమానికీ పెద్దపీట వేశారు. అయితే అలవాటులేని సంక్షేమ అజెండాను నెత్తికెత్తుకున్న టీడీపీ ... పలు కారణాలతో దానికి పూర్తిగా న్యాయం చేయలేకపోయింది. దీంతో 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని సైతం నిలబెట్టుకోలేదన్న అపప్రద మూటగట్టుకుంది. దీనికి ప్రతిగా వైసీపీ మాత్రం సంక్షేమ అజెండాకే పెద్ద పీట వేస్తూ, అందులోనూ తమ మార్కు చూపుతూ ముందుకెళ్లిపోతోంది.

మరోసారి అభివృద్ధినే నమ్ముకున్న టీడీపీ
గతంలో ఏ అభివృద్ధి అజెండాతో అయితే జనం తమకు ఓట్లు వేశారో, చంద్రబాబును మంచి పాలకుడిగా గుర్తించారో దాన్నే మరిపిస్తూ మరోసారి అదే అజెండాను తెరపైకి తీసుకొచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. తాజాగా మున్పిపల్ ఎన్నికల కోసం టీడీపీ ప్రకటించిస మ్యానిఫెస్టో చూస్తే ఇదే విషయం అర్ధమవుతుంది. పట్టణ మురుగునీటి వ్యవస్ధల అభివృద్ధి, శానిటేషన్ వర్కర్లకు జీతాల పెంపు, తాగునీు, ఇతర వసతుల కల్పన, ఉచిత తాగునీటి కనెక్షన్లు, సురక్షిత తాగునీరు, నిరుద్యోగ యువత కోసం జాబ్‌మేళాలు వంటి పథకాల ద్వారా అర్భన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.

అభివృద్ధిలోనే సంక్షేమం వెతుక్కుంటున్న టీడీపీ
టీడీపీ తాజాగా ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల మ్యానిఫెస్టోను గమనిస్తే మరో కొత్త అంశం కూడా ఉంది. కేవలం అభివృద్ధి మాత్రమే పట్టించుకుని సంక్షేమాన్ని విస్మరిస్తే ఓటర్లు గతంలో తిరస్కరించిన నేపథ్యంలో అభివృద్ధిలోనే సంక్షేమాన్ని కూడా గుర్తుకు తెచ్చేలా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే అన్న క్యాంటీన్లు తిరిగి తెరవడం, శానిటేషన్ వర్కర్ల జీతాలు రూ.21 వేలకు పెంపు, ఆటో డ్రైవర్లకు స్టాండ్ల ఏర్పాటు, తాగునీరు, ఇతర సౌకర్యాల కల్పన, ఆస్తిపన్ను బకాయిల రద్దు వంటి హామీలను ఇచ్చింది. దీంతో టీడీపీ మ్యానిఫెస్టో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా తమ బ్రాండ్ మార్క్‌తోనే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.