ఇసుక కొరతపై తాపీ పట్టిన చంద్రబాబు... టీడీపీ ధర్నా .. ఏపీ అసెంబ్లీలో ఇసుక సమస్య పై టీడీపీ వాయిదా తీర్మానం
ఇసుక కొరత, నూతన ఇసుక విధానానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ అసెంబ్లీ సమీపంలో ధర్నా నిర్వహించింది. చంద్రబాబుతో పాటు టిడిపి ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు ఈ నిరసనలో పాల్గొన్నారు . తాపీ పనిముట్లను, బంగారం కొలిచే త్రాసును చేతపట్టుకొని టిడిపి నేతలు నిరసన ర్యాలీ కొనసాగించారు. అసెంబ్లీకి కాలినడకన వెళ్లిన టిడిపి నేతలు ఇసుక ధరల పెంపు కారణంగా, ఇసుక బంగారంలా మారిపోయిందని, సామాన్యులకు దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

చంద్రబాబుపై కోపంతోనే ఉచిత ఇసుక పాలసీ రద్దు : అచ్చెన్న ఆరోపణ
ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని నిరసన తెలియజేశారు.
చంద్రబాబు పై కోపంతో నే ఉచిత ఇసుక పాలసీ ని ప్రభుత్వం రద్దు చేసిందని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వమే కావాలని కృత్రిమ కొరత సృష్టించిందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్య వల్ల 30 లక్షల మంది పరిస్థితి దుర్భరంగా మారిందని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, 60 మంది కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని మండిపడ్డారు.

18 నెలలుగా జరిగిన ఇసుక దోపిడీ జె టాక్స్ కి వెళ్ళింది : అచ్చెన్న
ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం అవినీతి విధానమని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి మరీ వైసీపీ నేతలు ఒప్పుకున్నారని పేర్కొన్నారు .
కొత్త ఇసుక విధానం పై ముఖ్యమంత్రి, మంత్రి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని, సొంత మనుషులకు ఇసుక కాంట్రాక్టులను కట్టబెట్టేందుకు ఈ తరహా డ్రామాలాడుతున్నారని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. 18 నెలలుగా జరిగిన ఇసుక దోపిడీ జె టాక్స్ కి వెళ్లిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ ను ప్రకటించాలని, భవన నిర్మాణ రంగానికి చేయూతనివ్వాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

నాణ్యమైన ఇసుక పక్క రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి
గతంలో ఉచితంగా ఉన్న ఇసుక నేడు భారంగా మారిందని టిడిపి నేతలు విమర్శలు గుప్పించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది అన్నారు. నాశిరకం ఇసుకను రాష్ట్రంలో పంపిణీ చేసి, నాణ్యమైన ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. మైనింగ్ మాఫియా ను అడ్డుకుంటామని, దోపిడీ కోసమే ఉచిత ఇసుక విధానం అమలు చేయడం లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీలో ఇసుక సమస్యపై వాయిదా తీర్మానం
మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప రాష్ట్రంలో ఎవరు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి నెలకొందని, ఇసుక సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి పెద్ద సమస్యగా మారిందని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ లో ఇసుక సమస్య పై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. నూతన ఇసుక విధానం తో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని టిడిపి పేర్కొంది. సామాన్యులకు ఇసుక దొరకడం లేదని, కాంట్రాక్టర్లు నేతలు మూకుమ్మడిగా దోచుకుంటున్నారని టిడిపి ఆరోపిస్తోంది.