తిరుపతి ఉప ఎన్నిక వేడి..నో సింపతీ: ఆ సంప్రదాయానికి చెక్ పెట్టిన చంద్రబాబు: వైసీపీతో ఢీ
అమరావతి: చిత్తూరు జిల్లా తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి నిర్వహించబోయే ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించడం.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది. తెలుగుదేశం పార్టీ సంప్రదాయాన్ని తప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం అనుసరించిన ఆ ఆనవాయితీని టీడీపీ కొనసాగించడానికి సుముఖంగా లేదనే విషయాన్ని స్పష్టం చేసినట్టయిందని అంటున్నారు విశ్లేషకులు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్కా రాజకీయ నాయకుడిగా వ్యవహారించారని చెబుతున్నారు.

తిరుపతి ఉప ఎన్నిక వేడి..
తిరుపతి లోక్సభ స్థానానికి నిర్వహించబోయే ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. అన్ని పార్టీల కంటే ముందే- తెలుగుదేశం.. తన అభ్యర్థిని ప్రకటించింది. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకురాలు పనబాక లక్ష్మిని ఈ ఉప ఎన్నిక బరిలో దింపింది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఆమె టీడీపీ అభ్యర్థిగా తిరుపతి నుంచే లోక్సభకు పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాద్ చేతిలో ఓడిపోయారు. రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

బల్లి దుర్గా ప్రసాద్ మరణంతో..
కరోనా వైరస్ బారిన పడిన వైఎస్ఆర్సీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణించిన విషయం తెలిసిందే. చెన్నైలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 16వ తేదీన కన్నుమూశారు. ఆయన మరణించడం వల్ల తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను నిర్వహించాల్సి వస్తోంది. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన 16 నెలల కాలంలో ఎదురైన ఉప ఎన్నిక కావడం వల్ల తమ రాజకీయ బలబలాలను పరీక్షించుకోవడానికి అన్ని పార్టీలు దీన్ని ఒక వేదిగా భావిస్తున్నాయి..ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.

సంప్రదాయాన్ని తప్పిన టీడీపీ..
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ.. రాజకీయ సంప్రదాయాన్ని తప్పినట్టయింది. ఎమ్మెల్యే లేదా ఎంపీ మరణిస్తే.. ఆయన స్థానంలో ఉప ఎన్నికలో పోటీ చేయబోయే అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే సంప్రదాయం కొన్నాళ్లుగా కొనసాగుతూ వస్తోంది. ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లేదా ఎంపీ మరణిస్తే.. అదే పార్టీకి చెందిన నాయకుడికి గెలిచే అవకాశం ఇవ్వాలని, తమ అభ్యర్థిని పోటీ పెట్టకూడదనేది ఆనవాయితీ రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. తిరుపతి లోక్సభ స్థానానికి పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించడంతో టీడీపీ దాన్ని తప్పినట్టయింది.

టీడీపీ హయాంలో
మరణించిన వారి కుటుంబ సభ్యులు లేదా.. ఆయన స్థానంలో ఎన్నికల్లో పోటీ చేయకూడదనే సంప్రదాయాన్ని వైఎస్ఆర్సీపీ పాటించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014లో కృష్ణాజిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికను నిర్వహించగా.. వైసీపీ పోటీ చేయలేదు. టీడీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ మరణించారు. ఆ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిని నిలబెట్టలేదు. టీడీపీ తరఫున ప్రభాకర్ కుమార్తె తంగిరాల సౌమ్య విజయం సాధించారు. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య కన్నుమూయగా.. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి నిర్వహించిన ఉప ఎన్నికలోనూ వైసీపీ అభ్యర్థిని నిలబెట్టలేదు. బ్రాహ్మణయ్య కుమారుడు శ్రీహరి ప్రసాద్ టీడీపీ తరఫున గెలుపొందారు.

నంద్యాల.. అరకు మినహాయింపు..
టీడీపీ హయాంలో జరిగిన నంద్యాల, అరకు ఉప ఎన్నికలు దీనికి మినహాయింపు. నిజానికి- నంద్యాల అసెంబ్లీ స్థానం వైఎస్ఆర్సీపీదే. ఆ పార్టీ తరఫున గెలిచిన భూమా నాగిరెడ్డి పార్టీ ఫిరాయించారు. ఆ స్థానం తమది కావడం వల్లే తాము పోటీ చేశామని అప్పట్లో వైసీపీ నేతలు వివరణ ఇచ్చుకున్నారు. వైసీపీకే చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపడం వల్ల అరకు నియోజకవర్గం ఖాళీ అయినప్పటికీ.. ఉప ఎన్నికను నిర్వహించలేదు. నేరుగా ఆ మరుసటి ఏడాదే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లారు.