టీడీపీకి షాక్: వైయస్సార్సీపీలో చేరిన శోభా హైమావతి, మరో మాజీ ఎంపీ కూడా
అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఇద్దరు టీడీపీ కీలక నేతలు పార్టీని వీడారు. గురువారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు శోభా హైమావతి, మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్ని శ్రీను కూడా పాల్గొన్నారు.

జగన్ సారథ్యంలోనే అభివృద్ధి, అందుకే వైసీపీలో చేరారు: చిన్ని శ్రీను
ఈ సందర్భంగా విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్ని శ్రీను మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వాన్ని, ఆయన సంక్షేమ పాలన చూసి ఆకర్షితులై మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, మాజీ పార్లమెంటు సభ్యులు డీవీజీ శంకరరావు పార్టీలో చేరారని అన్నారు. తమ ప్రాంతంలో అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నందుకు వారు తమ పార్టీలో చేరారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పూర్తి స్థాయి అభివృద్ధి జగన్ సారథ్యంలోనే జరుగుతోందని స్పష్టం చేశారు.

జగన్ వల్లే సాధ్యమంటూ మాజీ ఎంపీ డీవీజీ శంకర్రావు
మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు మాట్లాడుతూ.. గతంలోనే విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరానని అన్నారు. అయితే, ఇవాళ ముఖ్యమంత్రి జగన్ను కలిశానని తెలిపారు. ట్రైబర్ ఏరియాలో విద్య, వైద్యం కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఒక సామాన్యుడికి భరోసా వచ్చిందంటే.. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వళ్లే సాధ్యం ఆయన కొనియాడారు.

వైసీపీలో చేరిన శోభ హైమావతి.. జగన్పై ప్రశంసలు
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళల పట్ల అవలంభిస్తున్న విధానాలు, వారి సంక్షేమం కోసం చేస్తున్న కృషికి ఆకర్షితమైనట్లు పేర్కొన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇస్తూ గౌరవిస్తున్నారని ముఖ్యమంత్రి విధానాలను ఆమె కొనియాడారు. రాష్ట్రంలో 90 లక్షల మంది మహిళలకు ఆసరా ఇస్తున్నారని, కింది స్థాయిలో ఉన్న వారికి కూడా ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని వ్యాఖ్యానించారు. గతంలో ఒక్క ట్రైబల్ మినిస్టర్ కూడా లేరని, ఇప్పుడు ఒక ట్రైబల్ మహిళకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, ఇది వైఎస్ జగన్కు మాత్రమే దక్కిన ఘనత అని ప్రశంసించారు. తాము కోరుకుంటున్న పరిపాలన జగన్ అందిస్తున్నందున వైసీపీలో చేరామని శోభా హైమావతి తెలిపారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేస్తామని శోభా హైమావతి అన్నారు. సీఎం జగన్ ఆప్యాయతతో కూడిన పలకరింపు తమకు చాలా ఆనందంగా ఉందన్నారు.