Ruler: బాలా మావయ్యా! మీ డైలాగ్ సూపర్.. టోటల్ గా మీ 'రూలర్' సినిమా..: నారా లోకేష్
అమరావతి: యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన తాజా సినిమా రూలర్. వేదిక, సోనల్ చౌహాన్ కథానాయికలు. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సీ కల్యాణ్ ఈ సినిమాను నిర్మించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన రూలర్.. ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చిత్రం యూనిట్ ప్రీ రిలీజ్ఈవెంట్ ను సైతం నిర్వహించింది. ఈ సందర్భంగానే మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది.
"ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే, దీన్ని పండించిన రైతుకు ఇంకెంత పవరు, పొగరు ఉంటుందో చూపించమంటావా?" బాలా మావయ్యా!మీ డైలాగ్ సూపర్. టోటల్ గా మీ సినిమా 'రూలర్' ట్రైలర్ అదుర్స్.దీన్నిబట్టి సినిమా దుమ్ములేపుద్దనిపిస్తోంది. ఆల్ ద బెస్ట్ బాలా మావయ్యా!https://t.co/F6HnZBGLrl
— Lokesh Nara (@naralokesh) December 8, 2019
ఈ ధాన్యం తింటున్న మీకే అంత పొగరు ఉంటే...
ఈ ట్రైలర్ నందమూరి అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. బాలకృష్ణ తన మార్క్ మేనరిజంతో పలికిన డైలాగులు సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి. `ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే, దీన్ని పండించిన రైతుకు ఇంకెంత పవరు, పొగరు ఉంటుందో చూపించమంటావా?..` అనే పవర్ ఫుల్ డైలాగ్ అంతే పవర్ ఫుల్ గా పలికిన విధానం బాలకృష్ణ ఫ్యాన్స్ ను కట్టి పడేస్తోంది.
బాలా మావయ్యా.. మీ డైలాగ్ సూపర్
ఈ డైలాగ్ బాలకృష్ణ అభిమానులనే కాదు.. ఆయన అల్లుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఈ డైలాగ్ అద్భుతంగా ఉందని బాలకృష్ణపై ప్రశంసలను కురిపించారు. తాను ఆదివారం ఉదయమే ట్రైలర్ ను చూశానని చెప్పుకొచ్చారు. ఒకే ఒక్క డైలాగ్ లో రైతుల గొప్పదనం గురించి.. బాలకృష్ణ అద్భుతంగా వర్ణించారని అన్నారు. ఆ డైలాగ్ ను పొందుపరుస్తూ ఓ ట్వీట్ చేశారు.
దుమ్ములేపుద్దనిపిస్తోందట..
బాలకృష్ణ డైలాగ్ పలికిన విధానం సూపర్ గా ఉందని, రూలర్ సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఈ ఒక్క డైలాగ్ ను బట్టి సినిమా ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్థమౌతోందని అన్నారు. సినిమా దుమ్ములేపుద్దనిపిస్తోందని చెప్పారు. ఆల్ ద బెస్ట్ బాలా మావయ్య అని తన ట్వీట్ ను ముగించారు. ఈ నెల 20వ తేదీన విడుదల కాబోయే ఈ సినిమా బాలకృష్ణకు మంచి పేరును తీసుకుని రావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు నారా లోకేష్ చెప్పారు.