రామతీర్థం ఉదంతంలో కీలక మలుపు: అశోక్ గజపతిరాజు సంచలన నిర్ణయం: హైకోర్టు జోక్యానికి
అమరావతి: విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థం అంశం తాజాగా రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువయింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మళ్లీ తీవ్రస్థాయి విభేదాలు, మాటల తూటాలకు కారణమైంది. తాజాగా ఇది మరో మలుపు తీసుకుంది. ఏపీ హైకోర్టు మెట్లెక్కింది. రామతీర్థం విషయంలో జగన్ సర్కార్ అనుసరిస్తోన్న విధానాలను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి కొద్దిసేపటి కిందటే ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ప్రఖ్యాత రామతీర్థం కోదండ రామస్వామి దేవస్థానానికి అశోక్ గజపతి రాజు ధర్మకర్తగా వ్యవహరిస్తోన్నారు. నీలాచలం బోడికొండపై మూడు కోట్ల రూపాయల వ్యయంతో జీర్ణోద్ధారణ పనులకు రెండు రోజుల కిందటే దేవాదాయ మంత్రిత్వ శాఖ శంకుస్థాపన చేసింది. ఆలయం జీర్ణోద్ధారణలో భాగంగా కొత్తగా ధ్వజ స్తంభం, ఆలయ ప్రాకారం, వంటశాలను నిర్మించాలని దేవాదాయ శాఖ ప్రతిపాదించింది.

దేవస్థానానికి చెందిన కోనేరు సుందరీకరణ, మెట్ల మార్గం ఆధునికీకరించడం వంటి పనుల కోసం మూడు కోట్ల రూపాయలను వ్యయం చేయాల్సి ఉంది. ఆరు నెలల వ్యవధిలో ఆలయ జీర్ణోద్ధారణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దేవదాయశాఖ ఇంజినీరింగ్ అధికారులు దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన కొద్దిసేపటికే అశోక్ గజపతి రాజు.. దీన్ని ధ్వంసం చేశారు.
దీనితో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు అశోక్ గజపతి రాజు వ్యవహారాన్ని తప్పుపట్టారు. ఈ విషయంలో రెండు పార్టీల నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో మాటలయుద్ధం సాగింది. శిలాఫలకంలో తన పేరును ముద్రించకపోవడం పట్ల అశోక్ గజపతి రాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని, ఈ కారణంతోనే ఆయన బోడికొండపై శంకుస్థాపన రాయిని ధ్వంసం చేశారని చెబుతున్నారు.
రామతీర్థం ఆలయం వద్ద వీరంగం సృష్టించిన కారణంగా దేవాదాయ శాఖ అధికారులు ఆయనపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన పేరు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దీన్ని కొట్టివేయాలని కోరుతూ అశోక్ గజపతి రాజు తాజాగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ధర్మకర్తగా తనను అవమానించారని, అకారణంగా తనపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారి పేర్కొన్నారు. ఈ పిటీషన్ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.