సాయిరెడ్డికి కీలక పదవులు అందుకే-గుట్టువిప్పిన బుద్ధా వెంకన్న-పొరుగు సీఎంలకు ఆహ్వానం
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న పోరులో నిత్యం ప్రత్యర్ధి పార్టీ నేతలపై విమర్శల్లో ముందుండే ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ నేత బుద్దా వెంకన్న ఇవాళ కౌంటర్లు వేశారు. ముఖ్యంగా వైసీపీలో సాయిరెడ్డికి తాజాగా కీలక పదవులు దక్కుతుండటంపై బుద్దా చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
ఏపీలో తాజాగా చోటు చేసుకుంటున్న గ్యాంగ్ రేప్ లు, ఆర్దిక సంక్షోభంపై స్పందిస్తూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని బుద్దా వ్యాఖ్యానించారు. బీహార్ ని ఏపీ మించిపోయిందని ఆరోపించారు. అంతే కాదు ఈ ఘనత జగన్ దేనన్నారు. రాష్ట్రం దివాళా తీసిందని, జగన్ దగ్గర డబ్బులు మాత్రం పుష్కలంగా ఉన్నాయని బుద్ధా వెంకన్న తెలిపారు. ఏపీలో దారుణ పరిస్థితులు ఉన్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పిన వ్యాఖ్యలు నిజమేనని బుద్దా పేర్కొన్నారు. ఆంధ్రాలో దారుణమైన పరిస్థితులు చూడడానికి ఇక్కడికి రావాలని ఏపీ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని బుద్దా ఆహ్వానించారు. తామే విమాన టికెట్లు కొని ఇస్తామని మరీ ఆఫర్ చేశారు. కాబట్టి తమ ఆహ్వానాన్ని మన్నించి రావాలని ఆయా సీఎంలకు ఆయన కోరారు.

వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డిపై బుద్దా తీవ్ర విమర్శలకు దిగారు. ఉత్తరాంధ్రకి విజయ సాయిరెడ్డి అనే ఒక క్రిమినల్ ని ఇంఛార్జ్ గా వేశారంటూ జగన్ పై ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ ని విజయ సాయి రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించారుకాబట్టే, ఆయనకు పార్టీలో పెద్ద పదవులు ఇచ్చారని ఆరోపించారు. విశాఖ పరిపాలన రాజధాని అన్నారని, కానీ అక్కడ ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. పైగా విశాఖను ధ్వంసం చేశారని బుద్ధా విమర్శించారు. .