చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సత్యప్రభ కన్నుమూత
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ గురువారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యప్రభ బెంగళూరు వైదేహి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదికేశవులు నాయుడు మృతితో రాజకీయాల్లోకి వచ్చారు సత్యప్రభ. 2014 ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2019 సాధారణ ఎన్నికల్లో రాజంపేట టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
కాగా, ఇటీవలే సత్యప్రభ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా రెండోసారి ఎన్నికయ్యారు. సత్యప్రభ మృతి పట్ల టీడీపీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె లేకపోవడం టీడీపీ తీరని లోటేనని అన్నారు. పలువురు నేతలు ఆమెకు నివాళులర్పించారు.