ఎన్నికల వేళ జలీల్‌ఖాన్ రీ ఎంట్రీ- వెల్లంపల్లి బచ్చా- వైసీపీని అందుకే వీడా-జగన్ మూడు ప్లేట్ల కథ
ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఏపీ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. గత ఎన్నికల్లో పోటీ చేయకుండా తన కుమార్తెను రంగంలోకి దింపిన జలీల్ ఖాన్.. ఫలితాల తర్వాత అమెరికా వెళ్లిపోయారు. దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత తిరిగి వరుస ఎన్నికల వేళ బెజవాడలో ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడంతోనే వైఎస్ జగన్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై జలీల్ విరుచుకుపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్, మంత్రి వెల్లంపల్లి అరాచకాలు. ఇలా ప్రతీ అంశంపైనా తనదైన శైలిలో చెలరేగిపోయారు. దీంతో ఇప్పుడు ఆయన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

స్టీల్ ప్లాంట్ భూములమ్మే హక్కు ఎక్కడిది ?
విశాఖ ఉక్కుఫ్యాక్టరీకి చెందిన 7వేల ఎకరాలను జగన్ అమ్మేస్తానంటే, ఆ భూములు అమ్మే అధికారం, హక్కు జగన్ కు ఎక్కడివని టీడీపీ అధినేత ప్రశ్నిస్తే, సిగ్గులేకుండా వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన్ని తప్పుపడుతున్నాడని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విమర్శించారు. ఎవరో ఇచ్చిన భూములనుఅమ్మేసే హక్కు, జగన్ కి, వెల్లంపల్లికి ఎక్కడినుంచి వస్తుందన్నారు. జగన్ విశాఖను రాజధానిగా ప్రకటించిందే భూములు అమ్మకోవడానికని జలీల్ ఖాన్ తేల్చిచెప్పారు. బచ్చా అయిన వెల్లంపల్లి చంద్రబాబుపై విమర్శలు చేయడమే పెద్దపొరపాటన్నారు. జగన్ కు దమ్ము, ధైర్యముంటే విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ని కాపాడేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. స్థానిక ఎన్నికలు అయిపోయాక పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ జైల్ భరో కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో ఉన్నానని జలీల్ ఖాన్ తెలిపారు.

లంచాల కోసమే గుళ్లలో ఈవోల మార్పులు
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో పనిచేసే అధికారులను మార్చిన తరువాత, దేవాలయాల్లోని హుండీలకన్నా వెల్లంపల్లి హుండీనే ఎక్కువగా నిండుతోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆరోపించారు. దేవాలయాల్లో ఈవోలను మార్చినందు కు వారినుంచి కూడా డబ్బులు వసూలుచేశాడన్నారు. ఈ విధంగా వెల్లంపల్లి చరిత్ర గురించి చెబితే, పుస్తకాలకు పుస్తకాలే ఉంటాయన్నారు. ఎన్నికల ముందు వెల్లంపంల్లి ఎలా ఉండేవాడో, ఇప్పుడు ఎలా ఉన్నాడో ప్రజలే గమనించాలన్నారు. దేవాదాయశాఖా మంత్రి అంటే ప్రజలంతా గౌరవిస్తారని, అటువంటి గౌరవం పొందే అర్హత ఏమాత్రం లేని వ్యక్తి వెల్లంపల్లి అన్నారు. దేవాదాయ శాఖమంత్రిగా పనిచేసినవారెవరూ తిరిగి రాజకీయాల్లో కొనసాగలేదని, వెల్లంపల్లికి దమ్ముంటే, టీడీపీ ప్రభుత్వం ఎక్కడ విగ్రహాలు తొలగించిందో ఆధారాలు చూపాలన్నారు. వెల్లంపల్లిని మంత్రిగా గౌరవించలేనని, అతని పనితీరు, చర్యలు చూస్తే, నాకు అలా అనిపించడంలేదన్నారు.

కార్పోరేషన్లో ఓడితే మంత్రి పదవి పోయినట్లే
గతంలో గెలిచినప్పుడు, వెల్లంపల్లి శ్రీనివాస్ నావద్దకు వచ్చి, అన్నా నీదయవల్లే గెలిచానంటూ చెప్పాడని జలీల్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటివాడో, వెల్లంపల్లి కంటే తనకే బాగా తెలుసునన్న జలీల్ ఖాన్, శ్రీనివాస్ ప్లేటు జగన్ చేతిలో ఏదోఒకరోజు తిరగబడటం ఖాయమన్నారు. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో వెల్లంపల్లి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో తెలియదు కానీ, వాటిలో అధికార పార్టీ వారు గెలవకపోతే, జగన్ చేతిలో శ్రీనివాస్ కు ఎలాంటి పరాభవం ఎదురవుతుందో మాటల్లో చెప్పలేమన్నారు.

వైసీపీని అందుకే వీడానన్న జలీల్ ఖాన్
వైసీపీలో ఉన్నప్పుడు ఆ పార్టీకోసం తాను ఎంతో కష్టపడ్డానన్న జలీల్ ఖాన్, ఆతరువాత జగన్మోహన్ రెడ్డి పనితీరుచూసి విసిగిపోయి, నియోజకవర్గ అభివృద్ధికోసం టీడీపీలోకి రావడం జరిగిందన్నారు. వెల్లంపల్లి తన వర్గానికి కూడా న్యాయంచేయలేద ని, అందుకే గత ఎన్నికల్లో అతని వర్గంవారంతా తనకు ఓట్లేశారని జలీల్ ఖాన్ చెప్పారు. వెల్లంపల్లిని చూస్తుంటే, ఎక్కడా మంత్రిలా కనిపించడని, అతన్ని చూస్తుంటే బఫూన్ లా కనిపిస్తాడన్నారు. గెలుపుఓటము లు అనేవి సహజమని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక విజయవాడలో చేసిన అభివృద్ధేమిటో వెల్లంపల్లి చెప్పాలన్నారు. విజయవాడలో ఫ్లైఓవర్లు, రోడ్లు వేసింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు.జగన్ పాలనచూస్తే నవ్వొస్తోందని, రాష్ట్ర రాజధాని ఏదని చదువుకునే విద్యార్థులను అడిగితే, ముఖ్యమంత్రి మూడు రాజధానులను ప్రకటించాడు, వాటిలో ఏది రాజధానో తమకు తెలియదనే పరిస్థితిలో ఉన్నారన్నారు.

జగన్ మూడు పేట్ల కథ
జగన్ ఎవరిపై చర్యలు తీసుకోవాలన్నా, మూడు ప్లేట్లపై ఆధారపడతాడని, ఒక ప్లేట్ విజయసాయిరెడ్డి అయితే, మరోప్లేట్ సజ్జల రామకృష్ణారెడ్డి అని, మూడో ప్లేట్ జగన్ అన్నారు. ఆ మూడు ప్లేట్లలో ఏదితిరగబడినా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు మూడుతుందన్నారు. పట్టణాలు, నగరాల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు భయపడరని, పోలీసులకు ఎలా సమాధానం చెప్పాలో తమకు తెలుసునన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి పతనం తప్పదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అమరావతికేంద్రంగా జరిగే నిర్మాణపనుల్లో దాదాపు లక్షమందికి పైగా కార్మికులు ఉండేవారని, ఇప్పుడు ఆప్రాంతాన్ని చూస్తుంటే బాధగా ఉందన్నారు. రాష్ట్రప్రజల కర్మకొద్దీ జగన్ ముఖ్య మంత్రయ్యాడన్నారు.