పంటకాల్వలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్: డ్రైవింగ్ సీట్లో నారా లోకేష్: ఎమ్మెల్యేలకూ తప్పిన ముప్పు
ఏలూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయనతో పాటు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా సురక్షితంగా బయటపడ్డారు. నారా లోకేష్ నడుపుతోన్న ట్రాక్టర్ అదుపు తప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరికీ ఎలాంటి గాయాలు తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో వాహనంలో వారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలంలో ఈ మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా రైతులను పరామర్శించడానికి నారా లోకేష్ జిల్లాల పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆకివీడు మండలం పరిధిలోని గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సిద్ధాపురం వద్ద ఆయన కొద్దిసేపు ట్రాక్టర్ను నడిపారు. నారా లోకేష్ డ్రైవింగ్ చేస్తోండగా.. ఆయనకు కుడి, ఎడమల వైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంతెన రామరాజు, నిమ్మల రామానాయుడు కూర్చున్నారు. వరదనీటితో నిండిన రోడ్డు మీద నారా లోకేష్ ట్రాక్టర్ను నడిపించారు.

దర్శకుడిపై రేప్ ఆరోపణలు చేసిన నటి పొలిటికల్ ఎంట్రీ: బీజేపీకి మిత్రపక్షంలో: కీలక పదవి కూడా
కొంతదూరం వెళ్లిన తరువాత ట్రాక్టర్ అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న పంట కాల్వల్లోకి దూసుకెళ్లింది. ఒకవైపునకు ఒరిగిపోయింది. ట్రాక్టర్ ముందున్న టైర్లు పంట కాల్వలోకి దిగబడ్డాయి. నీటిలో మునిగాయి. దీన్ని గమనించిన వెంటనే ఎమ్మెల్యేలు మంతెన రామరాజు అప్రమత్తం అయ్యారు. ట్రాక్టర్ను అదుపు చేశారు. నారా లోకేష్ సహా అందరూ ట్రాక్టర్ నుంచి కిందికి దిగారు. వారికి ఎలాంటి
గాయాలు తగల్లేదు. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో పార్టీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం నారా లోకేష్ తన పర్యటనను కొనసాగించారు. సిద్ధాపురంలో రైతులను పరామర్శించారు.

