హత్య కేసు: యరపతనేనిని నిర్దోషిగా తేల్చిన కోర్టు
గుంటూరు: గుంటూరు జిల్లా గురజాల శాసనసభ్యుడు యరపతనేని శ్రీనివాస రావు హత్య కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డారు. కాంగ్రెసు నేత ఉన్నవ నరేంద్ర హత్య కేసులో ఆయనను కోర్టు నిర్దోషిగా తేల్చింది. యరపతనేని సహా 14 మందిని న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది. తాజా ఎన్నికల్లో యరపతనేని శ్రీనివాస రావు మూడోసారి శాసనసభ్యుడిగా గెలిచారు. అంతకు ముందు రెండు సార్లు ఆయన విజయం సాధించారు.
కాంగ్రెసు కార్యకర్త ఉన్నన నరేంద్ర హత్య కేసులో నిందితుడైన గుంటూరు జిల్లా గురజాల తెలుగుదేశం శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావును హైదరాబాద్ పోలీసులు నిరుడు జనవరి 8వ తేదీన అరెస్టు చేశారు. శ్రీనివాసరావు డిసెంబర్ 19 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు.

ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ను నరసరావుపేట కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన కోసం గురజాల డీఎస్పీ గిరిధర్ నేతృత్వంలో పోలీసు బృందాలు కొద్ది రోజులుగా గాలించాయి. హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వలవేసి ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని పిడుగురాళ్లకు తరలించారు.
హత్యకు గురైన నరేంద్ర తొలుత తెలుగుదేశం కార్యకర్తగా ఉండేవారు. ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలోకి మారారు. రియల్ ఎస్టేట్ వివాదాలు, క్రికెట్ బెట్టింగ్‌ల నేపథ్యం గల నరేంద్ర నవంబర్ 27న హత్యకు గురయ్యారు. తన అన్నను హత్య చేసేందుకు ఎమ్మెల్యే యరపతినేని కుట్ర పన్నారని నరేంద్ర సోదరుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేను మూడో నిందితుడిగా చేర్చారు.












Click it and Unblock the Notifications