కొత్త జిల్లాల్ని స్వాగతించిన బాలయ్య-ఎన్టీఆర్ జిల్లాపై మౌనం-హిందూపురంలో జిల్లా కేంద్రానికి డిమాండ్
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పలు చోట్ల కొత్త జిల్లాలు, మార్పులు, చేర్పులపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే స్ధూలంగా మాత్రం కొత్త జిల్లాలపై మంచి స్పందనే వస్తోంది. ఈ నేపథ్యంలో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ ఇవాళ దీనిపై స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.
ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్ని తాను స్వాగతిస్తున్నట్లు బాలకృష్ణ వీడియో సందేశంలో పేర్కొన్నారు. దీనిపై రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు. అలాగే అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి జిల్లాపై స్పందిస్తూ .. దానికి బదులుగా తన నియోజకవర్గం హిందూపురంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై గతంలోనే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి్నట్లు ఆయన గుర్తుచేశారు. దీనిపై మరోసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు బాలయ్య పేర్కొన్నారు.

మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జిల్లాపై మాత్రం బాలయ్య స్పందించలేదు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, తన సోదరీసోదరులైన పురంధేశ్వరి, నందమూరి రామకృష్ణ వంటి వారు స్పందిస్తున్నా.. దీనిపై బాలయ్య మాత్రం స్పందించలేదు. దీనికి బదులుగా కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు మాత్రమే బాలయ్య చెప్పారు. దీంతో బాలయ్య ఎందుకు ఎన్టీఆర్ జిల్లాను స్వాగతించలేదనే చర్చ జరుగుతోంది. మరోవైపు హిందూపురం జిల్లా కేంద్రంపై త్వరలో బాలయ్య.. సీఎం జగన్ ను కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే బాలయ్య విజ్ఞప్తికి జగన్ ఎలా స్పందిస్తారన్నది కూడా చూడాల్సిఉంది.
కొత్త జిల్లాల్ని స్వాగతించిన బాలయ్య-ఎన్టీఆర్ జిల్లాపై మౌనం-హిందూపురంలో జిల్లా కేంద్రానికి డిమాండ్#andhrapradesh, #anantapur pic.twitter.com/FknJZgvsMk
— oneindiatelugu (@oneindiatelugu) January 27, 2022