చరిత్రలో దుర్మార్గంగా మిగిలిపోయే పీఆర్సీని ప్రకటించిన సీఎం జగన్: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఆర్సి లొల్లి మళ్లీ మొదటికొచ్చింది. నూతన పిఆర్సి జీవోలను సోమవారం రాత్రి ఏపీ ప్రభుత్వం విడుదల చేయగా అందులో పలు అంశాలను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా హెచ్ఆర్ఏ ను 30 శాతం నుండి 16 శాతానికి తగ్గించడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పీఆర్సీ తమకు అవసరం లేదని మండిపడుతున్నాయి. ఇక టీడీపీ నేత అశోక్ బాబు సైతం పీఆర్సి జీవోలపై మండిపడ్డారు. జగన్ ఉద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.

ఇంత దారుణమైన పీఆర్సీని ఎప్పుడూ చూడలేదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పిఆర్సి జీవోలు ఉద్యోగులను ఆర్థికంగా మరింత కుంగదీసే విధంగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు సైతం జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. ఇంత దారుణమైన పీఆర్సీని ఎప్పుడూ చూడలేదని, ఇకపై చూడబోయేది లేదని ఎద్దేవా చేశారు. చరిత్రలో దుర్మార్గంగా మిగిలిపోయే పిఆర్సి ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారని మండిపడ్డారు. ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి ఓటేశారు అన్న విశ్వాసాన్ని కూడా సీఎం జగన్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పుడే ఉద్యోగులు వ్యతిరేకించాల్సింది
23 శాతం ఫిట్మెంట్ ఇచ్చినపుడే ఉద్యోగులు వ్యతిరేకించాల్సింది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండేళ్ల పదవీ విరమణ వయసు పెంచగానే ఉద్యోగ సంఘాల నాయకులు సంతోష పడ్డారని, కానీ ఇప్పుడు జరిగింది ఏమిటని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నాయకుల తీరుతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. 14 లక్షల ఉద్యోగుల జీత భత్యాల పై ఆలోచించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ అశోక్ బాబు వెల్లడించారు.

ఉద్యోగులు భౌతిక పోరాటం చేయకుండా సోషల్ మీడియాలో పోరాడితే లాభం లేదు
ఉద్యోగ సంఘాల జేఏసీలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారి మాటలు కిందిస్థాయి ఉద్యోగుల భవిష్యత్తును నిర్దేశిస్తాయి అనే ఆలోచన లేకుండా మాట్లాడారని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల తీరును తప్పుబట్టారు. ఉద్యోగులు భౌతిక పోరాటం చేయకుండా సోషల్ మీడియా గ్రూపు ద్వారా పోరాడితే ఎటువంటి ప్రయోజనం ఉండదని ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.

జీవోలు జారీ చేసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు ఎంత గింజుకున్నా ప్రయోజనం లేదు
ప్రభుత్వం జీవోలు జారీ చేసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు ఎంత గింజుకున్నా ప్రయోజనం ఉండదని ఆయన పేర్కొన్నారు. తాను టిడిపి నాయకుడిగా కాకుండా మాజీ ప్రభుత్వ ఉద్యోగిగా మాట్లాడుతున్నానని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టం చేశారు. ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం పై ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయిన సమయంలోనే గట్టిగా ప్రశ్నించాల్సింది అని పేర్కొన్నారు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఉద్యోగులకు ఇచ్చే హెచ్ఆర్ఏ తగ్గించి కేంద్ర ప్రభుత్వ నిబంధనలను జీవోలలో పేర్కొన్నారని, హెచ్ఆర్ఎ తగ్గించటం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఉద్యోగుల న్యాయపోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు.