ఏపీలో రాక్షసపాలన, నీళ్లడిగితే చంపేస్తారా?: తమ్మినేని సీతారాం బాధ్యులంటూ రామ్మోహన్నాయుడు ఫైర్
శ్రీకాకుళం: ఏపీ సర్కారుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాక్షస పాలన సాగుతోందని దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లా ఉప్పినవలస ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు.

పట్టపగలు కత్తులతో దాడులా..?: రామ్మోహన్నాయుడు
సొంత బాబాయ్ హత్య జరిగిన తర్వాత వైఎస్ జగన్ రాజకీయాలు చేశారన్న రామ్మోహన్నాయుడు.. ఇప్పుడు ఆయనను చూసే వైసీపీ కార్యకర్తలు కూడా అరాచకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఉప్పినవలసలో పట్టపగలు కత్తులతో సినిమా స్టైల్లో దాడి చేశారని ఆరోపించారు. ఇలాంటి సంస్కృతిని శ్రీకాకుళం జిల్లాకు తీసుకొచ్చిన ఘనత స్పీకర్ తమ్మినేని సీతారాంకే దక్కిందని విమర్శించారు. ఆడవాళ్లను సైతం మృగాళ్లలాగా కత్తులతో నరికారని రామ్మోహన్నాయుడు చెప్పారు. టీడీపీ అభ్యర్థిని సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించినందుకే ఇలా చేస్తున్నారన్నారు.

మంచినీళ్లడిగితే చంపేస్తారా?: ఊరుకోమంటూ రామ్మోహన్నాయుడు
మంచినీళ్లు, పింఛన్లు, చేయూత దగ్గర రాజకీయాలు చేస్తూ చంపేస్తారా? అని రామ్మోహన్నాయుడు నిలదీశారు. ఇలాంటివి కొనసాగిస్తే తాము చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. శ్రీకాకుళంలోని టీడీపీ శ్రేణులందరినీ ఏకం చేసి పోరాడతామన్నారు. తమ్మినేని కొడుకు ప్రోత్సహించడం వల్లే దాడులని వైసీపీ కార్యకర్తలే చెబుతున్నారని అన్నారు.

తమ్మినేని సీతారాంకు సంబంధం లేకుంటే..
దాడులతో తమకు సంబంధం లేదంటూ తమ్మినేని సీతారాం తప్పించుకోవాలని చూస్తున్నారని రామ్మోహన్నాయుడు మండిపడ్డారు. సంబంధం లేదంటే తమతోపాటు ఎస్పీ దగ్గరకు రావాలని సూచించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించాలన్నారు. లేదంటే మీడియా ప్రకటన చేయాలని కోరారు. లోపలొకటి.. బయటికొకటి మాట్లాడి రాజకీయాలు చేయడం సరికాదని రామ్మోహన్నాయుడు హితవు పలికారు.

దాడులకు తమ్మినేని సీతారం, ఆయన కుమారుడే బాధ్యులన్న కూన
మరోవైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా తమ్మినేని సీతారాంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ్మినేని సీతారం మనిషి రూపంలో ఉన్న ఒక మృగమని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి.. వారు తన్నుకుంటూ ఉంటే ఆయనకు సంతోషమని అన్నారు. వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోవడానికి తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడే కారణమని రవికుమార్ ఆరోపించారు. తమ్మినేని ఉన్మాదిలా మాట్లాడుతున్నారని.. కార్యకకర్తలను కూడా ఉన్మాదుల్లా మారుస్తున్నారని విమర్శించారు. టీడీపీకి ఓటు వేస్తే మంచినీళ్లు కూడా తాగనివ్వరా? అని నిలదీశారు. పోలీసుల బాధ్యతారాహిత్యం వల్లే ఉప్పినవలస ఘటన చోటు చేసుకుందన్నారు కూన రవికుమార్. తాను ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఒక్క వైసీపీ కార్యకర్తకు కూడా ఇబ్బంది కలిగించలేదన్నారు. ఉప్పినవలస ఘటనపై పోలీసులు స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.