
మిస్టర్ డీజీపీ.. మీ నోటీసులు చిత్తు కాగితాలతో సమానం; దమ్ముంటే ఆ పని చెయ్యండి: టీడీపీ జవాబిదే!!
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్, పట్టాభి, ధూళిపాళ్ల నరేంద్ర, ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితరులకు డ్రగ్స్ వ్యవహారంలో చేస్తున్న ఆరోపణలపై నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ లీగల్ నోటీసులపై స్పందించిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. డ్రగ్స్ దందాపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన టిడిపి నేతలకు నోటీసులు పంపించడం ఏ మేరకు సబబు చెప్పాలని ఆయన నిలదీశారు.

తాడేపల్లి పెద్దలను కాపాడటం కోసమే నోటీసులు
డ్రగ్స్ వ్యవహారంలో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలను కాపాడడం కోసం నోటీసులు పంపారు అంటూ ప్రశ్నించిన పట్టాభి, పోలీసులు పంపించిన లీగల్ నోటీసులు చిత్తు కాగితాలతో సమానం అంటూ వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ దందాపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా నిలదీస్తామని, క్షమాపణలు చెప్పాలంటూ పోలీసులు నోటీసులు పంపారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు అంటూ పట్టాభి ప్రశ్నించారు. మిస్టర్ డీజీపీ ఇలాంటి నోటీసులకు భయపడమని ధ్వజమెత్తారు . క్షమాపణలు చెప్పకుంటే చర్యలు తీసుకుంటామని నోటీసులలో పేర్కొన్నారని చెప్పిన పట్టాభి క్షమాపణలు చెప్పేది లేదని, రాష్ట్రం కోసం ప్రతిపక్షంగా పోరాటం కొనసాగించి తీరుతాం అంటూ స్పష్టం చేశారు.

పోలీస్ శాఖ వైఫల్యాలను కేంద్ర సంస్థలకు అందజేస్తామన్న పట్టాభి
త్వరలోనే పోలీస్ శాఖ వైఫల్యాలను కేంద్ర సంస్థలకు అందజేస్తామని పట్టాభి పేర్కొన్నారు. 72వేల కోట్ల డ్రగ్స్ కేసులో తాడేపల్లి బిగ్ బాస్ పాత్ర బయట పడకూడదనే టిడిపి నేతలకు నోటీసులు జారీ చేశారని పట్టాభి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని, భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించామని, రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంపై ఏ విధమైన దర్యాప్తు సాగించని, డ్రగ్స్ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న ఏపీ పోలీసులు టిడిపి నేతలకు నోటీసులు పంపించడం దారుణమని పట్టాభి అభిప్రాయపడ్డారు.
నేషనల్ మీడియా కూడా డ్రగ్స్ కు ఎపీకి లింక్ ఉందని చెప్పింది .. నోటీసులిచ్చారా?
ముంద్రా పోర్టులో డ్రగ్స్ పట్టుబడ్డాయి అని అక్కడ పట్టుబడిన డ్రగ్స్ కు, ఏపీకి లింకులు ఉన్నాయని నేషనల్ మీడియా కూడా వెల్లడించిందని పేర్కొన్న పట్టాభి నేషనల్ మీడియాకు నోటీసులు ఇచ్చే దమ్ము, ధైర్యం డీజీపికి ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారాన్ని కోడై కూస్తే అసలు ఈ వ్యవహారంపై పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం అనుమానాలకు కారణం కాదా అని ప్రశ్నించారు. పోలీసులు తాడేపల్లి ప్యాలెస్ కు సరెండర్ అయ్యి టిడిపి నేతలకు నోటీసులు పంపించారని పేర్కొన్నారు. డీజీపీకి ధైర్యముంటే డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీ నేతలను విచారించాలని పట్టాభి తెలిపారు.

ఏ మాత్రం చిత్త శుద్ధి ఉన్నా డ్రగ్స్ కేసు దర్యాప్తు చెయ్యండి
ఎమ్మెల్యేలు ద్వారంపూడి, సామినేని వ్యవహారాల నిగ్గు తేల్చాలన్నారు టిడిపి నేత పట్టాభి. బెదిరింపులకు భయపడేది లేదని, ఖాకీ యూనిఫాం మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా, రాష్ట్ర యువత భవిష్యత్ పట్ల ఏ మాత్రం చిత్త శుద్ధి ఉన్నా ముందు డ్రగ్స్ వ్యవహారంలో ఎంక్వైరీ చెయ్యాలని పట్టాభి పేర్కొన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్ట ఏనాడో పోయిందని, ఇండియన్ పోలీస్ సర్వీస్ ను జగన్ పర్సనల్ సర్వీస్ గా మార్చినప్పుడే పోలీసుల గౌరవం, ప్రతిష్ట మసకబారాయని పట్టాభి మండిపడ్డారు.

నోటీసులతో భయపెట్టాలని చూస్తే సహించేది లేదన్న టీడీపీ నేత పట్టాభి
ఇలాంటి నోటీసులతో భయపెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ లో విజయవాడకు చెందిన ఆషీ ట్రేడర్స్ మాచవరపు సుధాకర్ ను అరెస్ట్ చేసినట్టు, దర్యాప్తులో భాగంగా విజయవాడలోనూ సోదాలు చేసినట్టు పేర్కొన్నారని పట్టాభి తెలిపారు. నేర పూరితమైన పలు పత్రాలు, ఇతర వస్తువులను సీజ్ చేసినట్టు ఎన్ఐఏ పేర్కొందని, ఏ ఆధారాలతో ఈ కేసుకు, ఏపీకి సంబంధం లేదని చెప్తున్నారని పట్టాభి ప్రశ్నించారు. ఇప్పటికైనా టీడీపీ నేతలను అణచివెయ్యాలన్న ధోరణి పక్కనపెట్టి డ్రగ్స్ వ్యవహారంపై డీజీపీ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.