జగన్ రెడ్డి, మంత్రుల ఇళ్ల ముందు చెత్త వెయ్యాలంటున్న టీడీపీ నేతలు .. చెత్తపాలన అంటూ ఫైర్
రాష్ట్రంలో బ్యాంకుల ముందు చెత్త వేయడం వైసీపీ నేతల పనే అని విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బ్యాంకుల ముందు చెత్త పోవడంపై కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ రంగంలోకి దిగి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు కాల్ చేసి రుణాలు ఇవ్వకపోతే బ్యాంకు ముందు చెత్త వేస్తారా అంటూ చీవాట్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇదే సమయంలో బ్యాంకుల ముందు చెత్త వేయడం పై వైసిపి నాయకులు టార్గెట్ చేస్తూ టీడీపీ ధ్వజమెత్తింది. టిడిపి నాయకులు చెత్త పోయాల్సిన బ్యాంకుల ముందు కాదు ఏపీ సీఎం వైయస్ జగన్, ఏపీ మంత్రుల ఇళ్ల ముందు అని మండిపడుతున్నారు.

బ్యాంకులను బెదిరించడానికి చెత్త పోసిన జగన్ రెడ్డిది చెత్త పాలన : అయ్యన్నపాత్రుడు
బ్యాంకుల ముందు చెత్త వేయడం పై టిడిపి నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల ముందు చెత్త వేయడం పట్ల సీఎం జగన్ పై తీవ్రంగా మండిపడ్డారు. బ్యాంకులను బెదిరించడానికి చెత్త పోసి జగన్ రెడ్డిది చెత్త పాలన అని మరోసారి నిరూపించుకున్నారు అంటూ విమర్శించిన అయ్యన్నపాత్రుడు జగన్ రెడ్డి సైకో మనస్తత్వానికి బెదిరింపులకు ఏపీకి 200 కంపెనీలు గుడ్ బై చెప్పాయి అన్నారు.

చెత్త చర్యలతో బ్యాంకులు కూడా బై బై చెప్పటం ఖాయమంటూ ఫైర్
ఇప్పుడు చెత్త చర్యలతో బ్యాంకులు కూడా బై బై చెప్పటం ఖాయమంటూ మండిపడ్డారు. దేశ చరిత్రలో చెత్త పోసి బ్యాంకులను భయపెట్టిన వేస్ట్ గాడిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు సాయి రెడ్డి అంటూ అయ్యన్నపాత్రుడు బ్యాంకుల ముందు చెత్త వేయించడం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో చెత్త వేయాల్సింది బ్యాంకుల ముందు కాదని, బీసీ నాయకుల విగ్రహాలు తీసేస్తామని మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలని, నివాసయోగ్యం కాని ఇళ్లస్థలాలు ఇస్తున్నందుకు జగన్ రెడ్డి ఇంటి ముందు చెత్త వేయాలని టీడీపీ శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్ విమర్శలు గుప్పించారు.

సీఎం జగన్ , మంత్రుల ఇళ్ళ ముందు చెత్త వెయ్యాలని డిమాండ్ : అనగాని సత్యప్రసాద్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఏపీ మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలని ఆయన డిమాండ్ చేశారు. గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామని మంత్రి అప్పలరాజు చెప్పడం దారుణమన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీలను చిన్న చూపు చూస్తోందని ఆరోపించిన అనగాని సత్యప్రసాద్, రాష్ట్రంలో దళితులపై మహిళలపై దాడులు గణనీయంగా పెరిగాయి అని విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని, పౌర హక్కులను రాష్ట్రంలో నుజ్జు నుజ్జు చేశారంటూ మండిపడ్డారు.

వైసీపీ నేతలు బ్యాంకర్లను కూడా బెదిరిస్తున్నారని మండిపాటు
అధికార మదంతో కళ్ళు నెత్తి కెక్కి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కులం బురదలో వైసీపీ నేతలు కొట్టుమిట్టాడుతున్నారు అన్న అనగాని సత్యప్రసాద్ వైసిపి ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకుల ముందు చెత్త పోసిన ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై టిడిపి నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల తీరును తప్పుబడుతున్నారు. జగనన్న తోడు, వైయస్సార్ చేయూత పథకాలకు లోన్లు ఇవ్వకపోవడంతో బ్యాంకుల ముందు వైసీపీ నేతలు చెత్త పోయించటం పై వైసీపీ నేతలు బ్యాంకర్లను కూడా బెదిరిస్తున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.