టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు .. 219 మందికి స్థానం .. యువత ,మహిళలకూ ప్రాధాన్యం
టీడీపీ అధినేత, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 219 మందితో ఏపీ టిడిపి రాష్ట్ర కమిటీని ప్రకటించారు. టిడిపి పునర్నిర్మాణంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో, పార్టీలో మార్పులకు నాంది పలికారు చంద్రబాబు. ఇప్పటికే పార్టీలో ఉన్న పాత వ్యవస్థకు స్వస్తి పలికి ,పార్లమెంటరీ పార్టీ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇటీవల టిడిపి పోలిట్ బ్యూరో, జాతీయ కమిటీలను ప్రకటించిన అధినేత చంద్రబాబు ఇవ్వాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీని ప్రకటించారు.
చంద్రబాబు గణిత మేధావి, లోకేష్ బాలమేధావి.. అమరావతి కథ , స్క్రీన్ ప్లే బాబుదేనట !!

219 మందితో టిడిపి రాష్ట్ర కమిటీ ఏర్పాటు
సుదీర్ఘ కసరత్తు తర్వాత ఏపీ రాష్ట్ర కమిటీ ఎన్నిక పూర్తి చేసిన చంద్రబాబు సామాజిక సమీకరణాలను పాటిస్తూ , పార్టీలో యాక్టివ్ గా ఉండే వారికి ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలకు కూడా సముచిత స్థానం కల్పించారని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.
ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడుకి పట్టంకట్టారు చంద్రబాబు. ఇక అచ్చెన్న సైన్యంగా 219 మందితో టిడిపి రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసింది.

సామాజిక సమీకరణాలు పాటిస్తూ బడుగు, బలహీనవర్గాలకు పెద్ద పీట
ఇందులో 18 మందికి ఉపాధ్యక్షులు, 16 మందికి ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించారు. 18 మంది అధికార ప్రతినిధులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 108 మంది రాష్ట్ర కార్య దర్శులు, ఒక కోశాధికారిని నియమించారు. టిడిపి రాష్ట్ర కమిటీ లో బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు 61 శాతం పదవులు ఇచ్చినట్లుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. మహిళలకు కూడా సముచిత స్థానం ఇచ్చినట్లుగా పేర్కొంది. బీసీలకు 41 శాతం, ఎస్సీలకు 11 శాతం ,ఎస్టీలకు 3 శాతం, మైనార్టీలు 6 శాతం మందికి కమిటీలో స్థానం కల్పించింది టిడిపి.

కమిటీలో స్థానం దక్కించుకున్న పలువురు సీనియర్ నాయకులు
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శులుగా దేవినేని ఉమా, పయ్యావుల కేశవ్, ఎన్ అమర్నాథ్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ ,బుద్ధ వెంకన్న, భూమా అఖిలప్రియ, పంచుమర్తి అనురాధ, భత్యాల చెంగల రాయుడు, గౌతు శిరీష ,చింతకాయల విజయ్ , ఎండి నజీర్ , గన్ని కృష్ణ , మద్దిపాటి వెంకట రాజు, బాల వీరాంజనేయ స్వామి, బిటి నాయుడు లకు స్థానం కల్పించారు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా పత్తిపాటి పుల్లారావు ,నిమ్మల కిష్టప్ప , జ్యోతుల నెహ్రూ, గొల్లపల్లి సూర్యరావు, బండారు సత్యానందరావు, పరసా రత్నం , దాట్ల సుబ్బరాజు ,సాయి కల్పనా రెడ్డి ,బూరగడ్డ వేదవ్యాస్, సుజయకృష్ణ రంగారావు తదితరులను నియమించారు.

యువ నాయకత్వానికి ప్రాధాన్యత .. పార్టీలో నూతనోత్సాహం నింపే యత్నం
యువ నాయకత్వానికి కమిటీలో పెద్దపీట వేసినట్లు గా ,అన్ని కులాలు అన్ని ప్రాంతాల అన్ని పాటించినట్లు టీడీపీ ప్రకటించింది. ఇప్పటి వరకు పార్టీలో ఎటువంటి పదవులు లేని ఎంతోమంది కొత్తవారికి రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించిన టిడిపి రాష్ట్రంలో టిడిపిని బలోపేతం చేయడానికి రాష్ట్ర కమిటీ పని చేయాలని సూచించింది.
ఏపీలో అధికార పార్టీతో నిత్యం సమరం చేస్తున్న టీడీపీ యువ నాయకులకు స్థానం కల్పించి ప్రజా క్షేత్రంలో దూసుకుపోవాలని ఆదేశాలిచ్చింది .