ఏపీలోని బీసీలు బీసీలు కాదా? రాజ్యసభకు ఆర్.కృష్ణయ్యకు అవకాశంపై ప్రాంతీయ కార్డుతో టీడీపీ టార్గెట్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు వైయస్ఆర్సిపి అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నాలుగు స్థానాలలో ఒక స్థానానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కు సీఎం జగన్ మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. రాజ్యసభలో బీసీల గొంతును వినిపించాలన్న లక్ష్యంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్.కృష్ణయ్య కు అవకాశం కల్పించారని వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

రాజ్యసభ సభ్యుడిగా ఆర్. కృష్ణయ్యకు ఛాన్స్.. టార్గెట్ చేస్తున్న టీడీపీ
ప్రాంతాలకు అతీతంగా బీసీల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారంటూ కితాబిచ్చారు. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఆర్.కృష్ణయ్య అవకాశం కల్పించడం పై తెలుగుదేశం పార్టీ తప్పు పడుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించడం ఏ విధంగా సమంజసమని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఆర్.కృష్ణయ్య కు అవకాశం కల్పించడం పై తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు జగన్మోహన్ రెడ్డికి సూటి ప్రశ్నలు సంధించారు.
ఏపీలో వున్న బీసీలు బీసీలే కాదా: అయ్యన్న పాత్రుడు
పెద్దల సభకి వెళ్లే అర్హత ఏపీలోని 140కి పైగా వున్న బీసీ కులాలలో ఏ ఒక్క నేతకీ లేదా జగన్ రెడ్డి గారు? అంటూ ప్రశ్నించిన అయ్యన్నపాత్రుడు లేదంటే ఏపీలో వున్న బీసీలు బీసీలే కాదని మీరనుకుంటున్నారా? అంటూ నిలదీశారు. నిధులు,నీళ్లు, నియామకాలు నినాదంతో పోరాడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది తెలంగాణ. మీరేమో సీఎం అయిన మొదటి రోజునుంచే ఏపీ నిధులు, నీళ్లు,నియామకాలన్నీ తెలంగాణకి దోచిపెడుతున్నారు అంటూ నిప్పులు చెరిగారు.
ఏపీ బీసీలకి కూర్చోటానికి కుర్చీలు లేని పదవులు విదిల్చి.. తెలంగాణాకు కీలక పదవులా?
నిధులు,విధులతోపాటు కూర్చోవడానికి కుర్చీ కూడా లేని ఉత్తుత్తి 56 కార్పొరేషన్లు ఏపీ బీసీలకి విదిల్చి, తెలంగాణ వాళ్లకు అత్యున్నత రాజ్యసభ స్థానాలు కట్టబెట్టడం అంటే ఏపీలో వెనకబడిన తరగతుల నేతలకి వెన్నుపోటే అంటూ అయ్యన్నపాత్రుడు సోషల్ మీడియా వేదికగా జగన్ సర్కారు తీరును, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ప్రశ్నించారు. జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ నేతలకు అన్యాయం జరిగిందంటూ మండిపడ్డారు.

బీసీల మద్దతు కోసం జగన్ వ్యూహం; ప్రాంతాల పేరుతో తిప్పి కొడుతున్న టీడీపీ
బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కు జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా బిసి ఓటు బ్యాంకు టిడిపి వైపు వెళ్లకుండా చేసే ఎత్తుగడ వేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణయ్య కు రాజ్యసభ సభ్యత్వం అవకాశం కల్పించడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలలో ముఖ్య నాయకులకు ఎవరికైనా అవకాశం ఇస్తే బాగుండేదని, అలా కాకుండా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కృష్ణయ్య కు అవకాశం ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తూ జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతోంది. ఇంతకు ముందు అనేక కీలక పదవులను తెలంగాణా ప్రాంతం వారికి కట్టబెట్టిన విషయాన్ని గుర్తు చేస్తుంది. ఏపీలో ఎంతో మంది బీసీ నాయకులు ఉన్నారని, రాష్ట్రంలో బీసీల అభివృద్ధి కోసం వారు ఎంతగానో కృషి చేస్తున్నారని, జగన్ నిర్ణయంతో ఏపీ బీసీలకు అన్యాయం జరిగిందని బీసీలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది టిడిపి.