అటునుంచి నరుక్కొస్తున్న టీడీపీ.. సీఎం, స్పీకర్ను టార్గెట్ చేస్తూ.. దాడులు, బెదిరింపులపై ఫిర్యాదు..
వైసీపీ సర్కారును, సీఎం జగన్ ను ఇరుకున పెట్టడానికి తనకున్న అన్ని ఆప్షన్లను వాడుకుంటోంది ప్రతిపక్ష టీడీపీ. మూడు రాజధానుల వ్యవహారంలో మండలిలో చుక్కలుచూపించడంతోపాటు హైకోర్టులో న్యాయపోరాటం కూడా మొదలుపెట్టింది. ఇదే క్రమంలో కేంద్రం వైపు నుంచి సహకారం కోరుతున్నట్లు సంకేతాలు పంపింది. చంద్రబాబు నేతగా ఉన్న తెలుగుదేశం శాసనసభాపక్షం(టీడీఎల్పీ) బుధవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాసింది. అందులో తీవ్రస్థాయి ఆరోపణలున్నాయి.

బెల్లం కొట్టిన రాయిలా స్పీకర్..
వైసీపీ ప్రభుత్వం శాసనసభను అప్రజాస్వామికంగా నడుపుతోందని, ప్రతిపక్ష పార్టీకి కనీసం మాట్లాడే అవకాశం కూడా కల్పించడంలేదని, సభా సంప్రదాయాలుగానీ, నిబంధనల్నిగానీ పాటించడంలేదని, పూర్తిగా పక్షపాత ధోరణితో, ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆరోపించింది. సభలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా స్పీకర్ కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారని, బెల్లం కొట్టన రాయిలా వ్యవహరిస్తున్నారని మండిపడింది. సభ రాజ్యాంగ బద్ధంగా నడిచేలా ఆదేశాలివ్వాలని గవర్నర్ ను కోరింది.

సీఎం రెచ్చగొడుతున్నారు..
శానసన సభలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు, దూషణలు చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా తన మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారని, రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని టీడీఎల్పీ తన ఫిర్యాదులో పేర్కొంది. అధికార బలంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బెదిరింపులకు గురి చేస్తున్నారని, అసెంబ్లీ లాబీల్లోనే బేరసారాలకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా, అసెంబ్లీ రూల్స్ ను ధిక్కరిస్తోన్న సీఎం జగన్, స్పీకర్ సీతారాంలపై తగిన రీతిలో చర్యలకు ఆదేశించాలని లేఖలో అభ్యర్థించింది.

అందుకే టీవీ ప్రసారాల నిలిపివేత..
ప్రజాస్వామ్య దేశాలయమైన అసెంబ్లీలోనే వైసీపీ నేతలు అరాచక చర్యలకు పాల్పడుతున్నారని, అవి ప్రజలకు తెలియకుండా ఉండేందుకే సభా కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను నిలిపేశారని టీడీపీఎల్పీ విమర్శించింది. అంతకుముందు అసెంబ్లీలో పోడియం చుట్టూ నిరసనలు చేస్తోన్న టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. ‘‘పనికిమాలిన మనుషులు.. పనికిమాలిన పార్టీ.. మార్షల్స్ లో అవతలికి గెంటించండి..''అంటూ ఆగ్రహం ప్రదర్శించిన సంగతి తెలిసిందే.