విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్యాపింగ్ ట్విస్ట్, కాల్‌డేటా వివరాలు కోరడం సరికాదు: హైకోర్టుకు తెలంగాణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాల్ డేటా వివరాలు ఇవ్వాలంటూ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని, ఈ కేసు తదుపరి విచారణ ప్రక్రియనూ నిలిపివేస్తూ ఆదేశాలివ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టును మంగళవారం నాడు ఆశ్రయించింది.

కాల్ డేటా ఇవ్వాల్సిందిగా టెలికాం ఆపరేటర్లకు ఈ నెల 7వ తేదీన బెజవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వారంలో విజయవాడ కోర్టుకు కాల్ డేటా ఇవ్వాలని, మూడు వారాల తర్వాత దానిని కోర్టు చూడాలని సుప్రీం ఆదేశించింది.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాల్ డేటా ప్రతులు ఇవ్వాలనడం న్యాయసమ్మతం కాదని హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. తెలంగాణ హోంశాఖ పిటిషన్ దాఖలు చేసింది. బెజవాడ కోర్టు పరిధి దాటి వ్యవహరించిందని పేర్కొంది. కాబట్టి కోర్టు ఆదేశాలు నిలుపుదల చేయాలని కోరింది.

తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. 25 టెలిఫోన్ నెంబర్ల క్లా డేటాను, ట్యాపింగ్‌కు సంబంధించిన లేఖలను సమర్పించాలని విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాలు చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.

Telangana Moves HC, Seeks Stay on Phone Tap Case at Vijayawada Court

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఆపరేటర్ల నుంచి కావాల్సిన సమాచారాన్ని పొందే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. దర్యాఫ్తు సంస్థలు వివరాలు కోరినప్పుడు అందజేయాలని, అలా అందజేసిన సమాచారాన్ని తమ వద్ద ఉంచుకోరాదన్నారు.

దీనికి సంబంధించి కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఈ నెల 13న సెల్యూలార్ ఆపరేటర్లకు స్ఫష్టం చేసిందన్నారు. ఈ విషయాన్ని బెజవాడ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లినా పరిగణలోకి తీసుకోలేదన్నారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాల నిమిత్తం తమ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీపీ కోరిన వివరాలను అందజేయాలని ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కాల్ డేటా వ్యవహారంలో ఎవరి ప్రాథమిక హక్కులకైనా భంగం కలిగితే హైకోర్టును ఆశ్రయించవచ్చునని తెలిపిందని, అందుకే తాము పిటిషన్ దాఖలు చేశామన్నారు.

సుప్రీం కోర్టు నిర్దేశించిన గడువు తర్వాత ఆపరేటర్లు సీల్డు కవర్లో సమర్పించిన వివరాలను పరిశీలించే అవకాశముందని, ఇది తమ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమైనందున హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా కేంద్ర హోంశాఖ, టెలికాం మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఏపీ సిట్, బిఎస్ఎన్ఎల్, ఎయిర్ టెల్, ఐడియా, రిలయన్స్ తదితరులను పేర్కొన్నారు.

English summary
The Telangana government on Tuesday moved the Hyderabad High Court seeking a stay on all proceedings in the alleged phone tapping case at the Chief Metropolitan Magistrate (CMM) Court in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X