gutta sukhender reddy ponnam prabhakar vivek manda jagannadham telangana congress bjp trs గుత్తా సుఖేందర్ రెడ్డి పొన్నం ప్రభాకర్ వివేక్ మందా జగన్నాథం తెలంగాణ కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్
జగన్ పార్టీతో టిడిపి కుమ్మక్కు, మళ్లీ కుట్ర: టిఎంపీలు
ఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీమాంధ్ర ఎంపీలు, రాజకీయ నాయకులపై తెలంగాణ ప్రాంత ఎంపీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఢిల్లీలో వారు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తెలంగాణకు అనుకూలమని చెప్పిన అన్ని పార్టీలు ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం దారుణమని వారు అన్నారు. తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి వెంటనే బయటికి రావాలని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ కోరారు.
సీమాంధ్ర తెలుగుదేశం ఎంపీలు వచ్చిన తెలంగాణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు కుట్రలు చేస్తుంటే.. ఇంకా ఆ పార్టీలో తెలంగాణ ప్రాంత నేతలు కొనసాగడం తగదని అన్నారు. సీమాంధ్ర ఎంపీలది తెలంగాణపై కక్ష సాధింపు చర్య అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఢిల్లీలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతున్నాయని మరో ఎంపి పొన్నం ప్రభాకర్ అరోపించారు.

తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతలు ఎంతటికైనా దిగజారుతారని రుజువు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. వైయస్పార్ కాంగ్రెస్ పార్టీతో టిడిపి కుమ్మక్కైందని, ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత నేతలు ఆ పార్టీని వీడి బయటికి రావాలని పొన్నం కోరారు. తెలంగాణ ప్రాంతం వారు రాక్షసులు కాదని, సీమాంధ్ర ప్రాంతానికి ఏం కావాలో అడుగుతారని అన్నారు. తెలంగాణను ఇంకా దోచుకోవాలని.. సీమాంద్ర పాలకులు తమ పాలనను కొనగించాలనుకుంటే అడ్డుకుంటామని పొన్నం అన్నారు.
సీమాంధ్ర నేతల రాజీనామా డ్రామాలు: వివేక్
తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపీలు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి వివేక్ ఆరోపించారు. గతంలో కూడా తెలంగాణను అడ్డుకునేందుకు ఇలాంటి డ్రామాలే ఆడారని ఆయన అన్నారు. ఢిల్లీలో వైయస్సార్ కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. శీతకాల పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ఆమోదించాలని వివేక్ డిమాండ్ చేశారు.
1956 నుంచి తెలంగాణ కోసం పోరాటం కొనసాగుతోందని మరో ఎంపి మందా జగన్నాథం అన్నారు. 1200మంది తెలంగాణ పౌరుల ఆత్మ బలిదానాలు, సకల జనుల సమ్మె, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు చేసిన ఆమరణ దీక్షలతో సుదీర్ఘంగా సాగిన ఉద్యమ పోరాట ఫలితంగా తెలంగాణ సిద్ధించిందని ఆయన అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు అనుకూలమని ప్రకటిస్తే.. ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని జగన్నాథం ఆరోపించారు.
అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలే తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు అవిశ్వాసం పెట్టడంతో వారి దుర్మార్గం బయటపడిందని ఆయన అన్నారు. వారి కుట్రలను అడ్డుకుని, ఆంక్షలు లేని హైదరాబాద్, సంపూర్ణ తెలంగాణ కోసం పోరాట చేస్తామని మందా జగన్నాథం అన్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గితే తెలంగాణ ప్రజలు క్షమించరని చెప్పారు.
తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తమ పార్టీ సీమాంధ్ర నేతలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ను డిమాండ్ చేశారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ఆమోదించాలని అన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అవిశ్వాసానికి మద్దతు పలికే ఆలోచన చేయడం తగదని అన్నారు. బయటికి తిట్టుకుంటూ టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఢిల్లీలో తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయని మరో ఎంపి రాజయ్య ఆరోపించారు.