వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప్పులేటి డౌట్..జలీల్ సేఫ్: కొడాలి నానిపై దేవినేని

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు మొదలు పెట్టారు. ఇటీవలి కాలంలో అభ్యర్థుల ఎంపికపై ఆయన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. కృష్ణా జిల్లాలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చంద్రబాబు పెద్ద కసరత్తే చేశారు. జిల్లాలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధీటైన అభ్యర్థులను నిలబెట్టబోతున్నారు.

వైఎస్ఆర్ సీపీ నుంచి పార్టీ ఫిరాయించి, తెలుగుదేశంలో చేరిన వారి స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. దీనితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 10 స్థానాల్లో విజయం సాధించింది. అయిదు స్థానాలను ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ దక్కించుకుంది. అప్పట్లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా కేటాయించిన కైకలూరు నియోజకవర్గంలో బీజేపీ గెలుచుకుంది. అయిదుమంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు పార్టీ ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఫ్యాను గుర్తుపై గెలిచిన విజయవాడ వెస్ట్, పామర్రు ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, ఉప్పులేటి కల్పన సైకిల్ ఎక్కారు.

జలీల్ సేఫ్..ఉప్పులేటి డౌట్..

జలీల్ సేఫ్..ఉప్పులేటి డౌట్..

ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఉప్పులేటి కల్పనకు టీడీపీ హ్యాండిస్తోంది. పామర్రులో ఉప్పులేటి కల్పనకు ఈ సారి టికెట్ దక్కదని చెబుతున్నారు. ఈ స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలో దించాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రస్తుత ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య 2014 ఎన్నికల్లో ఉప్పులేటి కల్పనపై తెలుగుదేశం తరఫున పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. 1059 ఓట్ల స్వల్ప తేడాతో వర్ల రామయ్య ఆ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. వచ్చే ఎన్నికల్లో వర్ల రామయ్యనే పామర్రు నుంచి నిలబెట్టడానికి చంద్రబాబు ఏ మాత్రం సుముఖంగా లేరిని చెబుతున్నారు. స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ, పామర్రు నుంచి పోటీ చేయడానికి వర్ల పేరును చంద్రబాబు కనీసం పరిశీలనలో కూడా తీసుకోవట్లేదట. ఈ సారి ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగే అవకాశాలు ఉన్నందున, వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను ఢీ కొట్టగల సత్తా వర్ల రామయ్యకు లేదని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. అలాగని సిట్టింగ్ ఫిరాయింపు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు కూడా టికెట్ ఇవ్వడానికి ఇష్ట పడట్లేదట. తనకు గానీ లేదా తన భర్త దేవీ ప్రసాద్ కు గానీ టికెట్ ఇవ్వాలని ఉప్పులేటి కల్పన కోరుతున్నప్పటికీ.. కొత్త అభ్యర్థి కోసం చంద్రబాబు అన్వేషిస్తున్నారని కృష్ణా జిల్లా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

జలీల్ కుమార్తె ఖాయం

జలీల్ కుమార్తె ఖాయం

ఇదే జిల్లా నుంచి అసెంబ్లీకి ఎన్నికైన మరో ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయక పోవచ్చు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఆయన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పై 3100 ఓట్ల తేడాతో జలీల్ ఖాన్ గెలుపొందారు. అనంతరం ఆయన పార్టీ ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీ కండువాను కప్పుకొన్నారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడానికి జలీల్ ఖాన్ ఆసక్తి చూపట్లేదు. తనకు బదులుగా తన కుమార్తె షబానాకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. దీనికోసం నెలరోజుల కిందటే జలీల్ ఖాన్ తన కుమార్తెతోను వెంటబెట్టుకుని చంద్రబాబును కలిశారు. షబానాకు విజయవాడ వెస్ట్ టికెట్ దాదాపు ఖాయమైనట్టేనని అంటున్నారు. మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడు కావడం ఇక్కడ జలీల్ ఖాన్ కు కలిసి వచ్చింది. విజయవాడ వెస్ట్ లో ముస్లింల ఓట్ల శాతం అధికంగా ఉండటం వల్ల మైనారిటీ వర్గానికి చెందిన వారినే నిల్చోబెట్టాల్సి వచ్చింది. దీనితో జలీల్ ఖాన్ కుమార్తెకు టికెట్ ఖాయమైనట్టే.

కొడాలి నానిపై దేవినేని అవినాష్

కొడాలి నానిపై దేవినేని అవినాష్

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. ప్రస్తుతం ఈ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. 2014 ఎన్నికల్లో కొడాలి నాని..సుమారు 11 వేల ఓట్లకు పైగా మెజారిటీతో టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వర రావుపై విజయం సాధించారు. ఈ సారి కూడా వైఎస్ఆర్ సీపీ తరఫున కొడాలి పోటీ చేయడం ఖాయం. ఆయనకు ధీటైన అభ్యర్థిని చంద్రబాబు అన్వేషిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి, ఓడిపోయిన రావి వెంకటేశ్వరరావుకు టికెట్ దక్కట్లేదు. ఆయనకు బదులుగా దేవినేని అవినాష్ ను బరిలో దింపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్. 2014 ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారాయన. కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ లోక్ సభకు పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. రెండేళ్ల కిందటే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సారి కొడాలి నానిపై పోటీగా దేవినేని అవినాష్ ను దింపాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. గుడివాడలో అవినాష్ పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. మొదట్లో ఇక్కడి నుంచి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి.

 వంగవీటి రాధాకూ మొండిచెయ్యేనా?

వంగవీటి రాధాకూ మొండిచెయ్యేనా?

మొన్నటి వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇటీవలే పార్టీ ఫిరాయించారు. తాను కోరుకున్న విజయవాడ ఈస్ట్ కు బదులుగా మరో నియోజకవర్గాన్ని చూసుకోవాలని సూచించినందుకు పార్టీ ఫిరాయించారు రాధా. టీడీపీలో ఆయనకు టికెట్ ఖరారు కాలేదు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. రాధాకు శాసన మండలికి పంపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ.. ఎమ్మెల్యేల కోటాలో కుదరకపోవచ్చని అంటున్నారు. విజయవాడ ఈస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు టికెట్ ఖరారు చేశారు చంద్రబాబు. దీనితో ఇక్కడి నుంచి రాధా పోటీ చేయడం కుదరదు. అలాగని విజయవాడ వెస్ట్ గానీ, సెంట్రల్ గానీ ఇవ్వడం కూడా కుదరని పని. విజయవాడ వెస్ట్ సీటును షబానాకు కేటాయించారు. సెంట్రల్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావును కాదని రాధాను బరిలో దింపడం జరగని పని. దీనితో రాధాకు అసెంబ్లీ తలుపులు మూసుకుపోయినట్టే.

బీజేపీ గెలిచిన కైకలూరులో ప్రత్యామ్నాయం..

బీజేపీ గెలిచిన కైకలూరులో ప్రత్యామ్నాయం..

పొత్తులో భాగంగా 2014 ఎన్నికల్లో కైకలూరు స్థానాన్ని బీజేపీకి కేటాయించింది టీడీపీ. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున కామినేని శ్రీనివాస్‌ పోటీ చేసి, విజయం సాధించారు. ఈ స్థానంలో కొత్త అభ్యర్థిని వెదుకుతోంది టీడీపీ. ఏలూరు లోక్ సభ స్థానం పరిధిలోకి వస్తున్నందున.. ప్రస్తుత ఏలూరు ఎంపీ మాగంటి బాబును ఇక్కడి నుంచి పోటీ చేయించవచ్చని తెలుస్తోంది.

English summary
Telugu Desam Party President, Chief Minister of AP Chandrababu Naidu did fullpledged exercise on final list of candidates from Krishna district for up coming elections. He finalized almost sitting MLAs constituency same will be contest in Assembly elections. About Five seats, where is YSRCP sitting MLAs, Chandrababu launched search operation for better party candidate. Within a week Assembly seats in Krishna district candidates will be finalized says party sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X