చంద్రబాబుకు పోటీగా పార్ధసారధి: దీక్షా చేస్తానంటూ అనుచరులతో: అడ్డుకున్న పోలీసులు..ఉద్రిక్తం..!
టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న దీక్షకు వ్యతిరేకంగా తాను దీక్ష చేస్తానని వైసీపీ సీనియర్ నేత పార్దసారధి ప్రకటించారు. తమ పార్టీ నేతలతో సహా తన మీద టీడీపీ ఇసుక ఛార్జ్ షీట్ లో చేసిన ఆరోపణల మీద ఆధారాలు నిరూపించాలని డిమాండ్ చేసారు. బుధవారం సాయంత్రంలోగా ఆధారాలు చూపించకపోతే..తాను చంద్రబాబు దీక్ష చేస్తున్న ప్రాంతంలోనే తాను దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన నగర పోలీసు కమిషనర్ కు దరఖాస్తు చేయగా..పోలీసు శాఖ తిరస్కరించింది.
దీంతో..చంద్రబాబు దీక్ష చేస్తున్న ప్రాంతంలో అనుమతి లేకపోవటంతో.. తన క్యాంపు కార్యాలయం వద్ద దీక్ష చేస్తానంటూ పార్ధసారధి తన అనుచరులతో కలిసి బయల్దేరారు. వైసీపీ ఎమ్మెల్యేలు సైతం ఆయనకు మద్దతుగా తరలి వచ్చారు. పోలీసులు పార్దసారధిని బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో..అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను దీక్ష చేసి తీరుతానని..అనుమతి ఇవ్వకుంటే ఇంటి వద్దే తన అనుచరులతో కలిసి ధర్నా చేస్తానని పార్ధసారధి హెచ్చరించారు.

కార్యకర్తలతో కలిసి ఆందోళన..
చంద్రబాబు హాయంలో కోట్లాది రూపాయాల ఇసుక దోచుకున్నారని..తమ పార్టీ నేతల మీద అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మాజీ మంత్రి పార్ధసారధి మండిపడుతున్నారు. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి..వాస్తవాలు వివరించేందుకే తాను పోటీ దీక్షకు సిద్దమయ్యానని స్పష్టం చేసారు. అయితే, శాంతి భద్రతల సమస్య కారణంగా పోలీసులు చంద్రబాబు దీక్ష చేస్తున్న వేళ..పార్దసారధికి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసారు. దీంతో..పార్ధసారధి ఇంటి వద్ద హైడ్రామ చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున పార్టీ ఎమ్మెల్యేలు..కార్యకర్తలు తరలి వచ్చారు.
పార్దసారధి నుండి ఇంటి నుండి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేస్తుండగా..వారితో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు..కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పార్దసారధి ఇంటి వద్ద జరుగుతున్న పరిణామాలను తెలుసుకున్నవిజయవాడ నగరంలోని వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు. పోలీసులను సైతం పెద్ద ఎత్తున మోహరించారు. దీంతో..అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటి ద్దగరే దీక్ష చేస్తానని పార్ధసారధి చెబుతున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!