తిరుపతిలో అమరావతి సభపై ఉత్కంఠ-హైకోర్టు అనుమతిచ్చినా-సర్కారు సహకరిస్తుందా ?
ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర ముగిసింది. ఇప్పుడు ఎల్లుండి తిరుపతిలో బహిరంగసభ ఏర్పాటుకు రైతులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం ఎన్ని అభ్యంతరాలు చెప్పినా ఇవాళ హైకోర్టు మాత్రం అనుమతి ఇచ్చింది. అయితే ఓవైపు ప్రభుత్వ వైఖరి, మరోవైపు రాయలసీమ హక్కుల సమితి హెచ్చరికలతో ఈ సభ నిర్వహణపై చివరి నిమిషం వరకూ సస్పెన్ష్ కొనసాగబోతోంది.

తిరుపతిలో అమరావతి సభ
తిరుపతిలో ఎల్లుండి బహిరంగసభ ఏర్పాటు కోసం అమరావతి రైతులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ప్రభుత్వం దీనికి అనుమతించకపోయినా హైకోర్టును ఆశ్రయించి రైతులు అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం ఎల్లుండి మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ సభ జరగాల్సి ఉంది. ఇందుకు హైకోర్టు కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఇందులో శాంతిభద్రతలకు భంగం కలగకుండా సభ నిర్వహించుకోవాలని చెప్పింది. ఇప్పుడు ఈ అంశమే ప్రభుత్వానికి కలిసొచ్చేలా కనిపిస్తోంది.

రాయలసీమ సంఘాల హెచ్చరికలు
తిరుపతిలో అమరావతి రైతులు ఎల్లుండి చేపట్టిన బహిరంగసభకు అనుమతి కోరుతూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించగా.. దానికి పోటీగా సభ పెడతామని రాయలసీమ హక్కుల పోరాట సమితి మరో పిటిషన్ దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఎల్లుండి సభ కుదరదని, ఆ తర్వాత రోజు పెట్టుకోవాలని రాయలసీమ హక్కుల పోరాట సమితికి స్పష్టంచేసింది. మరోవైపు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అమరావతి రైతులు.... తిరుపతిలో సభ పెట్టడం ద్వారా తమను రెచ్చగొడుతున్నారని రాయలసీమ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. తిరుపతిలో సభ ఎలా పెడతారో చూస్తామని ఇప్పటికే హెచ్చరికలు చేస్తున్నాయి.

ప్రభుత్వ వాదన ఇదే
తిరుపతిలో అమరావతి రైతులు సభ పెడితే ప్రాంతీయ వైషమ్యాలు తలెత్తుతాయని, శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. అలాగే కరోనా కేసులు పెరుగుతున్నాయని, తాజాగా వచ్చిన వరదలకు రోడ్లు పాడయ్యాయని కూడా వాదించింది. ఈ వాదనలన్నీ హైకోర్టు విచారణలో నిలబడలేదు. దీంతో ఇప్పుడు ఇవే వాదనలతో తిరుపతి సభకు ప్రభుత్వం ఆటంకాలు కల్పించే ప్రమాదం ఉందని అమరావతి రైతులు అనుమానిస్తున్నారు. దీంతో రైతులు సభ నిర్వహణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

టెన్షన్ చివరి నిమిషం వరకూ టెన్షన్
ఓవైపు అమరావతి రైతులు తిరుపతిలో సభ పెట్టడంపై ప్రభుత్వ అభ్యంతరాలు, అలాగే రాయలసీమలో సంఘాల హెచ్చరికలు చూస్తుంటే ఎల్లుండి ఈ సభ జరిగే వరకూ దీనిపై ఉత్కంఠ తప్పేలా లేదు. ముఖ్యంగా ప్రాంతీయ వైషమ్యాలు తలెత్తుతాయని ప్రభుత్వమే హైకోర్టులో చెప్పడంతో దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శాంతిభద్రతలకు భంగం కలగకుండా సభ నిర్వహించుకోవాలని హైకోర్టు కూడా అమరావతి రైతులకు సూచించింది. కాబట్టి ఏ చిన్న అవాంఛనీయ ఘటన జరిగినా ప్రభుత్వం సీరియస్ గా స్పందించే అవకాశాలూ లేకపోలేదు. అటు రాయలసీమ హక్కుల సంఘాలు ఈ సభకు అవాంతరాలు కల్పిస్తే అప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇన్ని అపోహలు, అనుమానాలు, భయాల మధ్య ఎల్లుండి సభపై సర్వత్రా ఉత్కంఠ పెరుగుతోంది.