హిందూపురంలో హైటెన్షన్: బాలకృష్ట ఇంటిని ముట్టడించిన వైసీపీ: అడ్డుకున్న టీడీపీ
అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో ఈ ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం నాయకుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు తోసుకున్నారు. ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు పార్టీల వారిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తోన్నారు.
ఓ డంపింగ్ యార్డ్ విషయంలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందూపురం డంపింగ్ యార్డ్ విషయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకుడొకరు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు. జగన్ సర్కార్ గొప్పగా చెప్పుకొంటోన్న అభివృద్ధి ఎంత నాసిరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చని కామెంట్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ గెలిచిన తరువాత పట్టణ అభివృద్ధి స్తంభించిపోయిందని మండిపడ్డారు.
ఈ ఫొటోలు వైరల్గా మారాయి. దీని పట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు బాధ్యత ఉండదా? అంటూ ఎదురుదాడికి దిగారు. 2019 నాటి ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణను ఎంతో నమ్మకంతో హిందూపురం ప్రజలు గెలిపించుకున్నారని, ఏనాడైనా ఆయన తన నియోజకవర్గంపై దృష్టి పెట్టారా? అంటూ కౌంటర్ అటాక్ చేశారు. బాలకృష్ణ నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. చుట్టపు చూపుగా వచ్చిపోతుంటారని ధ్వజమెత్తారు.

బాలకృష్ణ వెంటనే హిందూపురానికి రావాలని డిమాండ్ చేశారు వైసీపీ నాయకులు. పట్టణ అభివృద్ధిపై సమీక్షలు జరపాలని పట్టుబట్టారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని నినాదాలు చేశారు. స్థానికంగా ఏదైనా సమస్యలు ఏర్పడితే- ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఉందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నా, లేనట్టేగా పరిస్థితులు తయారయ్యాయని విమర్శించారు. బాలకృష్ణ ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు.
ఈ సమాచారం తెలియడంతో స్థానిక తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో బాలకృష్ణ ఇంటివద్దకు చేరుకున్నారు. వైసీపీ నాయకులను అడ్డుకున్నారు. దీనితో వారి మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంది. ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని శాంతింపజేశారు. రెండు పార్టీల నాయకులు వేర్వేరుగా విలేకరుల సమావేశాలను ఏర్పాటు చేశారు. పరస్పరం ఆరోపణలను సంధించుకున్నారు.