టీడీపీ, వైసీపీల మధ్య పెరుగుతున్న మాటల యుద్ధం .. ఆ వైసీపీ నేత వదిలేలా లేరుగా
వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇష్టారాజ్యంగా విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి విలాసవంతమైన భవనాల చింత పట్టుకుంది అంటూ ఎద్దేవా చేశారు. ఇక దీనిపై టీడీపీ సీనియర్ నేత ఎనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. ఎవరెంతో అందరికీ తెలుసనీ ఆయన వ్యాఖ్యానించారు. ఇక తాజాగా ఎనమల రామకృష్ణుడిపై విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇలా మాటల దాడి కొనసాగుతూనే ఉంది . ఇది ఇప్పుడే చిలికి చిలికి గాలి వానలా మారుతుంటే భవిష్యత్ లో ఇంకే విధంగా ఉండబోతుందో అన్న అనుమానాలు ప్రతి ఒక్కరికీ కలుగుతున్నాయి.
వైవీ సుబ్బారెడ్డి హిందువు కాదంటూ దుమారం .. స్పందించిన వైవీ ఏమన్నారంటే

మొదట ట్విట్టర్ లో చంద్రబాబుని టార్గెట్ చేసిన వ్యాఖ్యలు చేసిన విజయసాయి
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు లేఖపై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సీఎం జగన్కు చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యలపై ఉంటుందని భావించామని కానీ ప్రతిపక్ష నాయకుడికి ప్రజా సమస్యలు పట్టవని ఎద్దేవా చేశారు. అమరావతిలోని విలాస భవనంపై చంద్రబాబుకు చింత పట్టుకుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.. ప్రపంచం మొత్తాన్ని అమరావతికి రప్పిస్తానని అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేదా అంటూ విజయ సాయి వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలకు ఎనమల రామకృష్ణుడు కౌంటర్ ఇచ్చారు .

విజయసాయిపై ఎనమల ఫైర్.. రివర్స్ కౌంటర్
ఉండవల్లిలోని ప్రజావేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖ మొదటిది కాదని పేర్కొన్న ఆయన ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే సమగ్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు సీఎం జగన్ కు లేఖ రాశారని తేల్చిచెప్పారు. ఇక ఆ విషయం చెప్పకుండా అధికారంలోకి వచ్చినా, వైసీపీ నేతలు అబద్ధాలు చెప్పడం మాత్రం మానలేదని ఎనమల పేర్కొన్నారు. విలాసవంతమైన భవనాలు ఊరికి ఒకటి చొప్పున ఎవరికి ఉన్నాయో అందరికీ తెలుసని విజయసాయి చెప్పనవసరం లేదని ఆయన విజయ సాయిని టార్గెట్ చేసి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇక విజయ సాయి ఎనమల రామకృష్ణుడి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఎనమల వ్యాఖ్యలకు జవాబుగా విజయసాయి ఘాటు వ్యాఖ్యలు
విజయ సాయి ఎనమల వ్యాఖ్యలకు స్పందిస్తూ యనమల గారూ... మీరు అడగటం, మేం ఇవ్వటం మొదలుపెడితే లోకేష్ కోసం ప్రకాశం బ్యారేజీ, చంద్రబాబు కోసం పోలవరం ప్రాజెక్టు కూడా ఇవ్వమని అడగగల సమర్ధులు మీరు అంటూ మరోమారు చురకలు అంటించారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా చంద్రబాబు గారూ? అంటూ మరోమారు చంద్రబాబు పై మాటలదాడి చేశారు కుప్పం, చంద్రగిరిలో నాయకులు అడ్డగోలుగా దోచుకోవడం వల్లే ప్రజలు పార్టీకి దూరమయ్యారని సమీక్షల్లో మీరు ఆవేదన చెందినట్టు మీడియాలో చూసి అంతా నవ్వుకుంటున్నారు అని ఆయన ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీలనే పచ్చ మాఫియాను సృష్టించి ఇప్పుడు నీతులు చెబితే ఏం లాభం?" అని విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అయితే ఏపీ రాజకీయాల్లో పెద్ద రగడగా మారుతున్న ఈ వివాదంపై తాజాగా విజయసాయి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే .
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!