కనువిందు చేస్తున్న లాక్ డౌన్ అద్భుతాలు ....చెంగు చెంగున గెంతుతూ స్వేచ్ఛగా తిరుగుతున్న వన్య ప్రాణులు
లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బంది పడుతుంటే వన్య ప్రాణులు మాత్రం ఊపిరి పీల్చుకుంటున్నాయి. లాక్‌డౌన్‌తో నెలరోజులకు పైగా జన సంచారం లేక చాలా చోట్ల రోడ్లపై నిశ్శబ్ద వాతావరణం నెలకొనడంతో వన్యమృగాలు స్వేచ్చగా సంచరిస్తున్నాయి . అద్భుత దృశ్యాలను ఆవిష్కరిస్తున్నాయి . అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో ఎప్పుడో అరుదుగా కనిపించే వన్య ప్రాణులు ఇప్పుడు నిత్యం స్వేచ్చగా తిరుగుతున్నాయి. కరోనా లాక్ డౌన్ వన్య ప్రాణులకు స్వేచ్చ నిచ్చింది. ప్రకృతికి ఊపిరి పోసింది. కాలుష్యాన్ని తగ్గించి భూమికు ఆయుష్షు పెంచింది .
లాక్ డౌన్ తో తిరుమల గిరులు నిర్మానుష్యం ... ఘాట్ రోడ్లపై జింకలు, చిరుతల సంచారం

స్వేచ్చగా తిరుగుతున్న వన్య ప్రాణులు
దారులు బోసిపోయాయి. మానవారణ్యం కరోనా నేపధ్యంలో సైలెంట్ అయ్యింది. ఇక దీంతో వన్య ప్రాణులకు స్వేఛ్చతో సంతోషం రెచ్చింది. ఫలితంగా ఎక్కడ చూడు గుంపులు గుంపులుగా వన్య ప్రాణులు దర్శనం ఇస్తున్నాయి. తాజాగా లాక్డౌన్ నేపథ్యంలో నిర్మానుష్యంగా మారిన నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో వన్యప్రాణులు సందడి చేస్తున్నాయి. రహదారులు బోసిపోవడంతో జింకల గుంపులు రహదారుల మీదకు వచ్చి కనువిందు చేశాయి .

గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలో సందడి చేసిన జింకల గుంపు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన జింకలు రహదారులపై సంచరించాయి. గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని గౌలిదొడ్డి ప్రధాన రహదారి పెట్రోలు బంకు వద్ద ఇటీవల వాహనదారులకు జింకల గుంపు కనిపించింది. ఇక ఈ జింకల గుంపును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు . ఇక అదే విధంగా ఆదోని బళ్ళారి మార్గంలో కూడా వందల కొద్దీ జింకలు రోడ్డు దాటుతూ కనువిందు చేశాయి. ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని ఆవిష్కరించాయి.

చెంగుచెంగున దూకుతూ ఆదోని బళ్ళారి రోడ్డు దాటుతున్న జింకల సమూహం
లెక్క పెట్టలేని సంఖ్యలో ఉన్న జింకల గుంపులు చెంగు చెంగున దుముకుతూ రోడ్డు దాటుతుంటే ఆ దృశ్యం అత్యంత మనోహరంగా అనిపించింది . ఇక ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తెలంగాణా రాష్ట్రంలో ఏటూరు నాగారం అభయారణ్యం , ఆదిలాబాద్ అడవుల్లో కూడా వన్య ప్రాణులు మనుషులు రోడ్ల మీద తిరిగినట్టు తిరుగుతున్నాయి. కొన్ని చోట్ల చిరుతలు సంచరిస్తున్నాయి.
జనగామ వద్ద పొలాల్లో పురి విప్పు ఆడుతున్న నెమళ్ళు... తిరుమలలోనూ కనువిందు చేస్తున్న వన్య ప్రాణులు
వందలాది నెమళ్లు (జాతీయ పక్షి), కుందేళ్లకు అవాసాలుగా ఉండే జనగామ-సిద్దిపేట రహదారిలోని చంపక్‌హిల్స్ ప్రాంతంలో కూడా సమీప పొలాల్లో నెమళ్ళు కనువిందు చేస్తున్నాయి. ఇక ఇటీవల కురుస్తున్న వర్షాలకు పూరి విప్పి నాట్యం చేస్తున్నాయి . ఇక ఇదే సమయంలో తిరుమలలోనూ ఘాట్ రోడ్ల మీద శేషాచల అడవుల నుండి వన్య ప్రాణుల సంచారం కొనసాగుతుంది. ఏనుగులు, జింకలు , దుప్పులు , చిరుతలు ఇలా ఒకటేమిటీ అరణ్యాలలో ఉండి జనాలకు భయపడి బయటకు రాని వన్య ప్రాణులు కరోనా పుణ్యమాని హాయిగా తిరుగుతున్నాయి.