నాడు కేసీఆర్- ఇప్పుడు జగన్ - సీఎంలే టార్గెట్‌గా ఫోన్ ట్యాపింగ్ పేరుతో చంద్రబాబు డేంజర్ గేమ్..
గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి సాయంతో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న టీడీపీ అధినేత చంద్రబాబు అసలు మా ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారంటూ కేసీఆర్‌నే ఆత్మరక్షణలోకి నెట్టేసి బయటపడ్డారు. ఇప్పుడు సరిగ్గా ఏపీలో జగన్‌పైనా అవే ఆరోపణలతో చంద్రబాబు చెలరేగి పోతున్నారు. అంతే కాదు ప్రతిపక్షంతో పాటు న్యాయవ్యవస్ధను, పాత్రికేయులను కూడా ఇందులోకి లాగుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరిని ముంచేస్తుందో తెలియక రాజకీయ నేతలు సైతం ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ వార్...
మన దేశంలో విపక్షాలను టార్గెట్ చేయాలని అధికార పార్టీలు, వాటి అధినేతలు భావించినప్పుడు ఫోన్ ట్యాపింగ్ ను ఓ సాధనంగా వాడుకుంటారనే ప్రచారం ఉంది. గతంలోనూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు విపక్ష నేతలపై నిఘా పెట్టి వారి ఫోన్లను ట్యాప్ చేసిన ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ రాష్ట్రాల్లో పరిస్ధితి వేరు. కేంద్రం తమ ఆధ్వర్యంలోని టెలికాం శాఖను వాడుకుంటూ జాతీయ భద్రత వంటి అంశాల్లో ఫోన్ల ట్యాపింగ్ చేసేందుకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. కానీ రాష్ట్రాలకు అలా కాదు. కేంద్రంలోని ప్రభుత్వాలు నడుపుతున్న పార్టీలే రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉంటే తప్ప అది సాధ్యం కాదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ నువిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఓ ఊతపదంగా మార్చేసుకున్నారు.

గతంలో కేసీఆర్ కు కౌంటర్‌గా...
2015 జూన్ నెలలో బొటాబొటీ మెజారిటీతో నెట్టుకొస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ ఎన్నికలను వాడుకుంటూ కూల్చేందుకు తెలంగాణలోనూ విపక్ష పార్టీగా ఉన్న టీడీపీ అధినేతగా చంద్రబాబు ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించిన కేసీఆర్ ప్రభుత్వం బిడ్డా ఇక నువ్వెలా తప్పించుకుంటావో చూస్తా అంటూ చంద్రబాబుకు తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈ సమయంలో చంద్రబాబు ఇరుక్కుపోయినట్లే, ఆయన రాజకీయ జీవితం ఇక ముగిసినట్లే అనే ప్రచారం సాగింది. కానీ చంద్రబాబు తన అనుభవాన్నంతా ఉపయోగించి అసలు తాము తప్పుచేశామని చెప్పేందుకు మీ దగ్గరున్న ఫోన్ కాల్స్ వివరాలు ట్యాపింగ్ ద్వారా ఎలా సేకరించారంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు. దీంతో అంతటి కేసీఆర్ కూడా ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ కేసు న్యాయస్ధానాల్లో నలుగుతుందే కానీ ఎలాంటి చర్యలు లేవు.

ఇప్పుడు జగన్‌పైనా అదే అస్త్రం...
గతంలో కేసీఆర్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి సక్సెస్ అయిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి జగన్ ప్రభుత్వంపైనా వాటినే ఎక్కుపెట్టారు. అధికార వైసీపీ ప్రతిపక్షాలతో పాటు న్యాయమూర్తులు, పాత్రికేయుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తోందంటూ కొత్త రాగం అందుకున్నారు. ఇందుకు ఆధారాలు ఏవైనా ఉన్నాయా అంటే సమాధానం లేదు. జగన్ సర్కారు విపక్షాలు, న్యాయమూర్తులు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులను బెదిరించి అదుపులో ఉంచుకునేందుకు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నట్లు ప్రధాని మోడీకి లేఖ రాసిన చంద్రబాబు.. దీనిపై కేంద్ర సంస్ధలతో విచారణ జరిపించాలని కోరారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు ఓ సహేతుక కారణంగానీ, ఆధారం కానీ లేదు, ప్రస్తుతం ఆయనకు వచ్చిన ఇబ్బందీ లేదు. కానీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో జగన్ సర్కారుపై ఒత్తిడి పెంచడం వెనుక కారణాలేంటనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.

న్యాయవ్యవస్ధతో ఆటలు..
ఓ సాధారణ జిల్లా జడ్జి రామకృష్ణను హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా పనిచేసిన మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య ఫోన్ కాల్ చేస్తే దాన్ని రికార్డు చేసి హైకోర్టుకు సమర్పించారు. దీన్ని రికార్డు చేసి ప్రస్తుతం ప్రభుత్వంలో భాగంగా ఉన్న జస్టిస్ ఈశ్వరయ్యను టార్గెట్ చేసిన వ్యవహారంలో టీడీపీ క్రియాశీలకంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఈశ్వరయ్య కాల్ రికార్డ్‌పై హైకోర్టు జ్యుడిషియల్ విచారణకు కూడా ఆదేశించింది. అంటే కాల్ రికార్డ్ చేసింది జడ్జి రామకృష్ణ కానీ ఆయనకు మద్దతిస్తున్న టీడీపీ కానీ అయ్యుండాలి. ఇది కూడా ఇంకా నిరూపణ కాలేదు. కానీ ఈ ఘటనను అడ్డుపెట్టుకుని న్యాయమూర్తులను, న్యాయవ్యవస్ధను చంద్రబాబు ఇందులోకి లాగుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏకంగా న్యాయమూర్తులపై నిఘా పెట్టిందని ఆరోపిస్తున్నారు. వీటికి ఎలాంటి ఆధారాలు లేకపోయినా న్యాయవ్యవస్ధ ప్రతిష్ట దెబ్బతినే అవకాశాలు ఉండటంతో హైకోర్టు ఇవాళ దీనిపై విచారణ జరపబోతోంది.