వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేతితో రుద్దితో పోతుంది!ఇదేం...హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్!:వాహనదారుల అసంతృప్తి

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి:దాని పేరే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్...అంటే ఏ విధమైన అక్రమాలకు తావివ్వకుండా అరికట్టే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేటెస్ట్ మోడల్ నంబర్ ప్లేట్. కాని ఆచరణలో దాని మన్నిక చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే...కారణం ఈ హై సైక్యూరిటీ ప్లేట్ కనీస భద్రతా ప్రమాణాలకు కూడా నోచుకోకుండా అత్యంత నాసిరకంగా ఉండటమే...

ప్రచారం జాస్తి...ప్రయోజనం నాస్తి

ప్రచారం జాస్తి...ప్రయోజనం నాస్తి

మూడేళ్ల క్రితం ఈ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల విధానం అమలు లోకి తెచ్చే సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటి గురించి ఎంతగా ఊదరగొట్టాయంటే?... వాహనాలకు పూర్తి భద్రత, దొంగలు,నేరస్థుల ఆట కట్టించే అవకాశం అనే ప్రచారంతో పాటు...ఏవేని బైకులు, కార్లు, ఇతర వాహనాలు దొంగతనం జరిగితే అవి ఎక్కడున్నా హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్ల సాయంతో గుర్తించవచ్చని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. ఈ నంబర్‌ ప్లేట్‌పై డిజిటల్‌ లేజర్‌ కోడ్‌ ఉంటుందని, బార్‌ కోడింగ్‌ ద్వారా అందులోని 11 అక్షరాలను గుర్తించి వాహనం వివరాలన్నీ పసిగట్టవచ్చని రవాణాశాఖ కూడా ప్రకటించింది. అంతేకాదు ఒకసారి అమర్చిన నంబర్‌ ప్లేట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తీయడం సాధ్యం కాదని భరోసా కూడా ఇచ్చింది.

జేబుకు...భారీ కన్నం

జేబుకు...భారీ కన్నం

అప్పటి వరకూ సాధారణ నంబర్‌ ప్లేట్లకు బైకుకు అయితే రూ.60, కారుకు రూ.180 ఖర్చుతో సమకూరేవి. అయితే ఈ హై సెక్యూరిటీ ప్లేట్ల విధానం అమల్లోకి వచ్చాక ద్విచక్ర వాహనాలకు రూ.245, నాలుగు చక్రాల వాహనాలకు రూ.619; ఆపై భారీ వాహనాలకు రూ.649గా ధరలు నిర్ణయించారు. మూడు రెట్లకుపైగా భారం పడుతున్నా వాటి గురించి చేస్తున్న ప్రచారం నమ్మి సేఫ్టీ కోసం వాహనదారులు భరించారు. కొందరు బైకు యజమానులు తమకు ఆ నంబర్ ప్లేట్ అవసరం లేదన్నా ఆర్టీఏ అధికారులు ఒప్పుకోకుండా వీటిని తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందేనని తెగేసి చెప్పారు. లేదంటే వాహన రిజిస్ట్రేషన్‌ చేయబోమని తేల్చి చెప్పారు. దీంతో యజమానులు తప్పనిసరి పరిస్థితుల్లో హై సెక్యూరిటీ ప్లేట్లను అమర్చుకున్నారు.

అసలు...రీడింగ్ మిషన్లే రాలేదు

అసలు...రీడింగ్ మిషన్లే రాలేదు

ఈ నెంబర్‌ ప్లేట్లను హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ గా మార్చడంలో ప్రధాన పాత్ర దానిపై ఏర్పాటు చేసిన హోలోగ్రామ్‌. ఈ హోలోగ్రామ్ పై డిజిటల్‌ లేజర్‌ కోడ్‌ ఉంటుందని, బార్‌ కోడింగ్‌ ద్వారా అందులోని 11 అక్షరాలను గుర్తించి వాహనం వివరాలన్నీ పసిగట్టవచ్చని రవాణాశాఖ పేర్కొంది. అయితే ఈ హాలోగ్రామ్ ను రీడ్‌ చేసే మిషన్లు మూడేళ్లైనా ఇక్కడి పోలీసుల చేతికి రాలేదు. దీంతో వీటి వల్ల వాహనదారులకు ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. సాధారణ నంబర్‌ ప్లేట్‌తో పోలిస్తే తమకు మూడు రెట్లు అదనపు బాదుడే తప్ప వీటివల్ల ఏం ఉపయోగం లేదని వాహనదారులు కుండబద్దలు కొడుతున్నారు. కాంట్రాక్టర్‌కు తప్ప ఇవి వాహనదారులకు ఎందుకూ ఉపయోగపడవని వాళ్లు తేల్చేస్తున్నారు.

ఒకరిమీదఒకరు...చెప్పుకుంటున్నారు

ఒకరిమీదఒకరు...చెప్పుకుంటున్నారు

నంబర్‌ ప్లేట్లపై ఉండే హోలోగ్రామ్‌ ఆధారంగా వివరాలు పసిగట్టే రీడింగ్‌ మిషన్లను మూడేళ్లయినా కాంట్రాక్టర్‌ సరఫరా చేయడంలేదు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లోనూ లింక్‌ ఆటో టెక్‌ అనే ఒకే కాంట్రాంక్టర్‌ జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఈ నెంబర్‌ ప్లేట్లను అమర్చుతున్నారు. రీడింగ్‌ మిషన్ల విషయమై పోలీసు అధికారులు జిల్లాల్లో రవాణాశాఖ అధికారులను ప్రశ్నిస్తుంటే తమకే ఇంకా అవి సరఫరా కాలేదని వారు సమాధానమిస్తున్నట్లు తెలిసింది. భారమైనా తమ వాహనానికి రక్షణ ఉంటుందనుకుని అమర్చుకున్న యజమానుల నమ్మకాన్ని రవాణా శాఖ దారుణంగా దెబ్బతీసింది.

చేత్తో రుద్దినా...హోలోగ్రామ్ మాయం

చేత్తో రుద్దినా...హోలోగ్రామ్ మాయం

దీంతో ఇప్పుడు ఈ నంబర్ ప్లేట్ పై బార్‌ కోడింగ్‌ ఉన్నా రీడ్‌ చేసే యంత్రాలు పోలీసుల వద్ద లేకపోవడంతో వాహనాన్ని దొంగలు పట్టుకెళ్లినా ఏమీ చేయలేని పరిస్థితి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే సీసీ కెమెరాల ఆధారంగా లేదా ఇతర మార్గాల్లో దర్యాప్తు చేసి వాహన రికవరీ కోసం ప్రయత్నించడమే తప్ప హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ వల్ల ఏమీ చేయలేని దుస్థితి. సరే ఇదంతా పక్కన బెడితే ఆ నంబర్‌ ప్లేట్ ఉన్నహోలోగ్రామ్‌ అన్నా సరిగా ఉందా అంటే అది కేవలం ఒక్క వాటర్‌ సర్వీసింగ్ తోనే అడ్రస్ లేకుండా పోతోంది. లేదా...దీన్ని ఏదేని సర్ఫ్ నీళ్లతో తడిపి కొన్ని సార్లు చేత్తో రుద్దినా కనిపించకుండాపోతోందంటున్నారు. ఇదేమిటిలా అని ఆరా తీస్తే వాహనాలను శుభ్రం చేసే సోప్‌ వాటర్‌ తగలడం వల్ల క్రోమియమ్‌ బేస్డ్‌ హోలోగ్రామ్‌ పాడవుతోందని రవాణాశాఖ అధికారులు సమర్థించుకుంటున్నారు. దీంతో ఈ హై సెక్యూరిటీ నంబర్లు ఒక ఫార్సుగా వాహనదారులు అభివర్ణిస్తున్నారు.

English summary
Amaravathi:Motarists expressed dissatisfaction over high security plates and they said RTO officers are affixing number plates only for name sake. "These plates can be easily manipulated by any fancy plate,” they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X