ఇది ముమ్మాటికీ బడాయి బడ్జెట్: సిపిఐ రామకృష్ణ
విజయవాడ: ఏపీ బడ్జెట్ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఘాటుగా స్పందించారు. ఇది ముమ్మాటికీ బడాయి బడ్జెట్టే నని ఆయన ఎద్దేవా చేశారు. గత ఏడాది ఏవిధంగా లక్షన్నర కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి, ఖర్చు చేసే సమయంలో కోతలు విధించారో...ఇప్పుడూ అదే జరుగుతుందన్నారు.
విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎపి బడ్జెట్ ను విశ్లేషించారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ బడ్జెట్లో ఎలాంటి భరోసా ఇవ్వలేదని చెప్పారు. రైతుల రుణమాఫీ కోసం రు.4100 కోట్లు కేటాయించారని, వీటితో ఈ ఏడాది కూడా రైతుల రుణాలు తీరే అవకాశం లేదన్నారు. అలాగే గ్రామీణాభివృద్ధి, సంక్షేమం పేరిట భారీగా కేటాయింపులు చూపినప్పటికి, ఖర్చు చేసేందుకు నిధులు ఎక్కడనుంచి తీసుకువస్తారో చెప్పలేదని విమర్శించారు.

ఇక సాగునీటి రంగానికి ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చూస్తే వచ్చే పదేళ్ళలో కూడా అవి కంప్లీట్ అయ్యే అవకాశమే లేదన్నారు. నిరుద్యోగ భృతికి సరైన విధివిధానాలు రూపొందించనే లేదన్నారు. మొత్తం మీద ఈ బడ్జెట్ అంచనాలు ఘనంగా, ఆచరణ శూన్యంగా ఉంటుందనేది స్పష్టమవుతోందని విశ్లేషించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.












Click it and Unblock the Notifications